
ఐఎన్‌ఎస్ అధ్యక్షురాలిగా ఉరంకర్
ఈసీ సభ్యుడిగా ’సాక్షి’ డైరెక్టర్ రాజప్రసాద్ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ (ఐఎన్‌ఎస్) నూతన అధ్యక్షురాలిగా 2017–18 ఏడాదికిగానూ బిజినెస్ స్టాండర్డ్స్ పత్రికకు చెందిన అకిల ఉరంకర్ ఎన్నికయ్యారు. శుక్రవారం బెంగళూరులో జరిగిన ఐఎన్‌ఎస్ 78వ వార్షిక సర్వసభ్య సమావేశంలో సొసైటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
సొసైటీ డిప్యూటీ ప్రెసిడెంట్‌గా జయంత్ మమ్మెన్ మాథ్యూ (మలయాళ మనోరమకు), ఉపాధ్యక్షుడిగా శైలేష్ గుప్తా (మిడ్–డే), జనరల్ సెక్రటరీగా ఎస్పీ కౌర్, గౌరవ ట్రెజరర్‌గా శరత్ సక్సేనా (హిందుస్తాన్ టైమ్స్) ఎన్నికయ్యారు. కార్యనిర్వాహక కమిటీ (ఈసీ) సభ్యుడిగా ‘సాక్షి’ మార్కెటింగ్, అడ్వరై్టజ్‌మెంట్ డైరెక్టర్ కె. రాజప్రసాద్ రెడ్డి (కేఆర్‌పీ రెడ్డి) ఎన్నికయ్యారు. కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా మొత్తం దేశ వ్యాప్తంగా వివిధ పత్రికలకు చెందిన 41 మందిని ఎన్నుకున్నారు.
నోట్లరద్దుతో వార్తాపత్రికలకు నష్టం
నోట్లరద్దు కారణంగా.. వార్తాపత్రికల ఆర్థిక పరిస్థితి క్షీణించిందని ఐఎన్‌ఎస్ ఆవేదన వ్యక్తం చేసింది. పరిశ్రమను కాపాడేందుకు ప్రభుత్వం సాయం చేయాలని కోరింది. నోట్లరద్దు వల్ల అడ్వరై్టజ్‌మెంట్లు గణనీయంగా తగ్గిపోయాయని ఐఎన్‌ఎస్ తాజా మాజీ ప్రెసిడెంట్ సోమేశ్ శర్మ పేర్కొన్నారు. జీఎస్టీలో వార్తాపత్రికలను వస్తువుల కేటగిరీలో చేర్చి పన్ను మినహాయింపునిచ్చినా.. పత్రికల్లో వచ్చే ప్రకటనల్ని సేవల కేటగిరీలో చేర్చి 5శాతం జీఎస్టీ విధించటం వల్ల నష్టం వాటిల్లుతోందన్నారు. ఇటీవల జర్నలిస్టులు, మీడియా కార్యాలయాలపై సంఘవిద్రోహ శక్తుల దాడులనూ సొసైటీ ఖండించింది.