80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మాణం
జీఆర్‌ఎస్‌ఈలో సిద్ధమైన సర్వే, హైడ్రోగ్రాఫిక్ వెసల్ నిర్దేశక్
110 మీటర్ల పొడవు, 3,800 టన్నుల బరువుతో నిర్మాణం పూర్తి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సాగర గర్భంలో ఏం జరుగుతోంది? ఉపరితలంపై ముంచుకొస్తున్న మప్పు ఏంటి? సముద్రంలో శత్రుదేశాల నుంచి తలెత్తే ఆపదలేంటి? ఇలా సుదీర్ఘ భారత సముద్ర తీరంలో అణువణువూ సర్వే చేసి... నావికాదళానికి అందించేందుకు నిర్దేశకుడు వస్తున్నాడు. సంధాయక్ క్లాస్‌లో రెండో అతి పెద్ద సర్వే వెసల్‌గా ఐఎన్‌ఎస్ నిర్దేశక్ బుధవారం జల ప్రవేశం చేసింది.
2014 వరకూ సేవలందించిన నౌక నిర్దేశక్‌ను గుర్తుచేసుకుంటూ ఈ కొత్త నౌకకూ అదే నామకరణం చేశారు. ఇండియన్ నేవీలో కీలక పాత్ర పోషిస్తున్న తూర్పు నౌకాదళం నుంచి సేవలందించేందుకు ఐఎన్‌ఎస్ నిర్దేశక్ సిద్ధమవుతోంది. కోల్‌కతాలో రూపుదిద్దుకున్న నిర్దేశక్... విశాఖలో రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ చేతుల మీదుగా జాతికి అంకితమైంది.
80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో...!
దేశంలోనే అతిపెద్ద సర్వేనౌక ఐఎన్‌ఎస్ సంధాయక్ తర్వాత... రెండో అతి పెద్ద సర్వే వెసల్ ఐఎన్‌ఎస్ నిర్దేశక్ భారత నౌకాదళంలో ప్రవేశించింది. 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్(జీఆర్‌ఎస్‌ఈ) సంస్థ 2020లో దీని తయారీ ప్రారంభించింది. నౌకాదళం కోసం జీఆర్‌ఎస్‌ఈ తయారుచేస్తున్న నాలుగు అధునాతన సర్వే నౌకల్లో నిర్దేశక్ రెండోది కావడం విశేషం.
ఓడరేవులు, నావిగేషనల్ ఛానెళ్లు, ఎకనమిక్ ఎక్స్‌క్లూజివ్ జోన్‌లో కోస్టల్, డీప్ వాటర్ హైడ్రో–గ్రాఫిక్ సర్వే నిర్వహించడం, రక్షణ కోసం ఓషనోగ్రాఫిక్ డేటాను సేకరించడంలో నిర్దేశక్ కీలక పాత్ర పోషించనుంది. దీంతోపాటు శోధన– రెస్క్యూ, సముద్ర పరిశోధనతో పాటు విపత్తు సమయంలో వైద్య సేవలందించే హాస్పిటల్ షిప్‌గానూ నిర్దేశక్‌ను తయారు చేశారు.
రక్షణ మంత్రిత్వ శాఖలో బలీయమైన శక్తిగా తూర్పు నౌకాదళం ఎదుగుతున్న నేపథ్యంలో ఈ అత్యాధునిక సర్వే వెసల్‌ని విశాఖపట్నం కేంద్రంగా సేవలందించేందుకు కేటాయించాలని భారత నౌకాదళం నిర్ణయించినట్టు సమాచారం. అయితే.. తొలి షిప్ సంధాయక్ ఇప్పటికే విశాఖ కేంద్రంగా సేవలందిస్తున్న నేపథ్యంలో రెండింటిలో ఒక నౌకని పశ్చిమ నౌకాదళానికి కేటాయించే అవకాశం ఉందని నౌకాదళ వర్గాలు చెబుతున్నాయి.
రూ.2,435 కోట్లతో 4 సర్వే వెసల్స్ నిర్మాణం
1968 నుంచి సంధాయక్ సర్వే వెసల్ భారత నౌకాదళంలో విశిష్ట సేవలందించి 2021లో సేవల నుంచి నిష్క్రమించింది. ఈ తరుణంలో ఇండియన్ నేవీకి సర్వే నౌకలు అవసరమని భావించిన రక్షణ మంత్రిత్వ శాఖ 2017లోనే నాలుగు సంధాయక్ క్లాస్ సర్వే వెసల్స్ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. రూ.2,435.15 కోట్లతో బిడ్‌ను జీఆర్‌ఎస్‌ఈ దక్కించుకుంది.
అత్యాధునిక సాంకేతికతతో పాటు స్వదేశీ పరిజ్ఞానంతో ఈ షిప్‌లను నిర్మిస్తున్నారు. ఈ క్లాస్ షిప్‌లలో మొదటిది జే18 పేరుతో ఐఎన్‌ఎస్ సంధాయక్‌ను 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించగా... జే 19 పేరుతో ఐఎన్‌ఎస్ నిర్దేశక్‌ని 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో పూర్తి చేశారు. తర్వాత ఐఎన్‌ఎస్ ఇక్షక్, ఐఎన్‌ఎస్ సంశోధక్ షిప్‌లు 2025 నాటికి భారత నౌకాదళంలోకి చేరనున్నాయని నౌకాదళ వర్గాలు చెబుతున్నాయి.
నిర్దేశక్‌కు గుర్తుగా...!
గతంలో నిర్దేశక్ పేరుతో సర్వే నౌక దేశానికి సుదీర్ఘంగా 31 ఏళ్ల పాటు సేవలందించింది. అనంతరం దీన్ని 2014 డిసెంబర్ 19న ఉపసంహరించారు. 1983 అక్టోబర్ 4న దీన్ని జాతికి అంకితం చేశారు. కేవలం సర్వే సేవలతో పాటు ఆపద సమయాల్లో ఇది ఆస్పత్రి నౌకగా కూడా మారిపోయింది. ప్రధానంగా కాండ్లాలో వచ్చిన భూకంపం సమయంలో, శ్రీలంకలో సంభవించిన సునామీ సమయంలో ఈ నౌక విశేష సేవలందించింది.
కర్ణాటకలోని కార్వార్ నౌకాదళ కేంద్రంగా ఇది పనిచేసింది. 18 మంది అధికారులతో పాటు 160 మంది సిబ్బంది ఇందులో సేవలందించేవారు. 1980 టన్నుల బరువు, 87.8 మీటర్ల పొడవైన ఈ నౌక... గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇదే పేరుతో వస్తున్న కొత్త నౌక మాత్రం 3,800 టన్నుల బరువు కలిగి ఉండటంతో పాటు 110 మీటర్ల పొడవు ఉంది. ఇది గంటకు 33 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.
జాతికి అంకితం
విశాఖ సిటీ: హిందూ మహాసముద్రంలో భారత్ తన ప్రాబల్యాన్ని మరింత పెంచుకునేందుకు ఐఎన్‌ఎస్ నిర్దేశక్ నౌక సేవలు దోహదపడతాయని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ పేర్కొన్నారు. భారీ అత్యాధునిక సర్వే నౌక ఐఎన్‌ఎస్ నిర్దేశక్‌ను ఆయన బుధవారం విశాఖలోని నేవల్ డాక్ యార్డ్‌లో జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోల్‌కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్–ఇంజనీర్స్ (జీఆర్‌ఎస్‌ఈ) సంస్థ 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో ఈ నౌకను నిర్మించిందని చెప్పారు.
ఈ నౌకలో మల్టీ బీమ్ ఎకో సౌండర్‌లు, సైడ్ స్కాన్ సోనార్లు, అటానమస్ అండర్ వాటర్ వెహికల్, రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్ వంటి అధునాతన హైడ్రోగ్రాఫిక్ సిస్టమ్‌లు పొందుపరిచినట్టు వెల్లడించారు. ఓడరేవులు, నావిగేషనల్ చానల్స్, ఎకనావిుక్ ఎక్స్‌క్లూజివ్ జోన్‌లో కోస్టల్, డీప్ వాటర్ హైడ్రో–గ్రాఫిక్ సర్వే నిర్వహణ, రక్షణ కోసం ఓషనోగ్రాఫిక్ డేటాను సేకరించడంలో నిర్దేశక్ కీలక పాత్ర పోషించనుందని వివరించారు.
శోధన–రెస్క్యూ, సముద్ర పరిశోధనతో పాటు విపత్తుల సమయంలో వైద్య సేవలందించే హాస్పిటల్ షిప్‌గానూ సేవలు అందించనుందని చెప్పారు. ఈ నౌక హిందూ మహాసముద్రంలో భద్రతతోపాటు పర్యావరణ, శాస్త్రీయ అన్వేషణ, శాంతి పరిరక్షక కార్యక్రమాలను బలోపేతం చేయడానికి దోహదపడుతుందన్నారు.
అత్యాధునిక సర్వే సాంకేతికత
తూర్పు నావికాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ మాట్లాడుతూ.. 110 మీటర్ల పొడవున్న నిర్దేశక్ నౌక అత్యాధునిక సర్వే సాంకేతికతను కలిగి ఉందని తెలిపారు. హిందూ మహా సముద్ర పరిసర ప్రాంతాల్లో హైడ్రోగ్రాఫిక్ సర్వేలు చేస్తూ భారత్ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు ఈ నిర్దేశక్ నౌక కీలక పాత్ర పోషిస్తుందన్నారు. 2025 నాటికి మరో రెండు నౌకలు భారత నౌకాదళంలోకి చేరనున్నాయని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment