
అమర్‌నాథ్ యాత్రికులపై దాడులకు జైషే ప్లాన్
శ్రీనగర్ : అమర్‌నాథ్ యాత్రలో యాత్రికులను టార్గెట్ చేస్తూ అదును చూసి విరుచుకుపడాలని ఉగ్రవాదులు సన్నద్ధంగా ఉన్నారని నిఘా సంస్థలు హెచ్చరించాయి. నిఘా సంస్థల సమాచారం ప్రకారం జమ్ము కశ్మీర్‌లోని గందేర్బల్, కంగన్ పర్వత ప్రాంతాల్లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు సమాచారం. పాకిస్తాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాదులు బల్తాల్ రూట్ ద్వారా వెళ్లే అమర్‌నాథ్ యాత్రికులను లక్ష్యంగా చేసుకున్నట్టు నిఘా సంస్థలు పసిగట్టాయి.
జులై 1 నుంచి ప్రారంభమయ్యే అమర్‌నాథ్ యాత్రపై ఉగ్రదాడి ముప్పు పొంచి ఉందని తాజా హెచ్చరికలతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. యాత్ర సాగే మార్గం వెంబడి పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేపట్టేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. అమర్‌నాథ్ యాత్రలో పాల్గొనే యాత్రికుల భద్రత దృష్ట్యా వారి కదలికలను తెలుసుకునేందుకు ఉపకరించే బార్‌కోడ్ ఆధారిత స్లిప్‌లు జారీ చేయనున్నారు. యాత్రికుల భద్రతను పెంచేందుకు మరింత అప్రమత్తంగా ఉండాలని పారామిలటరీ బలగాలు, సీఆర్‌పీఎఫ్‌లకు ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు జమ్ము కశ్మీర్‌లో భద్రతా అధికారులతో ఉన్నతస్ధాయి సమావేశం నిర్వహించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా యాత్రికుల భద్రతకు మరిన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.