సదానంద సుడిగాలి పర్యటన
- రైల్వే స్టేషన్లలో సౌకర్యాలపై ఆరా
- భద్రతా చర్యలు సరిగా లేవని అధికారులపై ఆగ్రహం
- సాధారణ బోగిలో ప్రయాణించిన రైల్వే మంత్రి
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలోని రైల్వే స్టేషన్లలో ఉన్న మౌలిక సదుపాయాలు, భద్రతా చర్యలను పర్యవేక్షించడానికి కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ ఆదివారం సుడిగాలి పర్యటన చేశారు. అధికారులతో పాటు ప్రయాణికులను కలుసుకుని సదుపాయాల కల్పన పట్ల ఆరాతీశారు. ఆదివారం ఉదయమే బెంగళూరులోని కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌కు వెళ్లి అక్కడ చేపట్టాల్సిన పనులు, అందుకు అవసరమైన ప్రణాళిక, నిధులు తదితర విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైల్వేస్టేషన్‌ను శుభ్రంగా ఉంచాలని సూచించారు.
అక్కడి నుంచి సిటీరైల్వే స్టేషన్‌కు వెళ్లి అక్కడి ఫ్లాట్‌ఫారం, శౌచాలయాలు, ప్రయాణికుల విశ్రాంతి గదులను పరిశీలించారు. అక్కడే ఉన్న హోటల్స్‌కు వెళ్లి అక్కడి ఆహార పదార్థాలను రుచి చూశారు. కొంతమంది ప్రయాణికులతో స్వయంగా మాట్లాడి సౌకర్యాల పట్ల ఆరా తీశారు. చాలా మంది రైల్వే స్టేషన్‌లో దొరుకుతున్న ఆహారం రుచిగా ఉండటం లేదని, నాణ్యతా ప్రమాణాలు తక్కువగా ఉంటున్నాయని ఫిర్యాదు చేశారు. అదే విధంగా టికెట్ల కోసం ప్రయాణికులు వేచి ఉండకుండా అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
అక్కడి నుంచి ఆయన సాధారణ ప్రయాణికుడిలా రైలులో చెన్నపట్టణ, మండ్య మీదుగా మైసూరు చేరుకున్నారు. ఆయా రైల్వే స్టేషన్‌లో ఆగి అక్కడి మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అనంతరం మైసూరులో రైల్వే అధికారులతో సమీక్ష సమావేశం జరిపారు. మైసూరు-బెంగళూరు-చెన్నై మధ్య ఈ ఏడాది హైస్పీడ్ రైలును అందుబాటులోకి తీసుకురావాలని ఇందుకు సంబంధించిన పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులను కేంద్ర మంత్రి సదానందగౌడ ఆదేశించారు.