ఛత్తీస్‌గఢ్ రాష్ర్టం సుక్మా జిల్లాలో మావోయిస్టుల నడుమ విభేదాలు వారిలో నలుగురి హత్యకు దారి తీశాయని పోలీసులు అంటున్నారు.
చింతూరు: ఛత్తీస్‌గఢ్ రాష్ర్టం సుక్మా జిల్లాలో మావోయిస్టుల నడుమ విభేదాలు వారిలో నలుగురి హత్యకు దారి తీశాయని పోలీసులు అంటున్నారు. వారం రోజులుగా జరిగిన ఈ హత్యలు ఆదివారం వెలుగులోకి వచ్చాయంటున్నారు. మావోయిస్టుల నడుమ ఆధిపత్య పోరు జరుగుతోందని, లొంగిపోయేందుకు సిద్ధమవుతున్న సహచరులను మావోయిస్టులు హతమారుస్తున్నారని చెపుతున్నారు. జిల్లాలోని గాదిరాస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోండేరాస్ అటవీ ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఛత్తీస్‌గఢ్‌లోని దర్బా మిలిటెంట్ దళం కమాండర్ హేమ్లాభగత్, అతని భార్య కోసీలు లొంగిపోయేందుకు ప్రయత్నించగా, గత నెల 27న భగత్‌ను మావోయిస్టులు హతమార్చినట్లు చెపుతున్నారు. రెండు రోజుల అనంతరం దండకారణ్య కిసాన్ మజ్దూర్ సంఘ్ అధ్యక్షురాలిగా పని చేస్తున్న కోసీని కూడా హతమార్చి మృతదేహాలను అటవీ ప్రాంతంలో పడేసినట్లు ప్రకటించారు. ఇదే క్రమంలో అయితు అనే వారి సహచరుడిని కూడా మావోయిస్టులు హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. కాగా మూడు రోజుల క్రితం మావోయిస్టు మలంగీర్ ఏరియా కమిటీ సభ్యుడు బద్రు అలియాస్ మాసాను కూడా మావోయిస్టులు హతమార్చినట్లు కుటుంబ సభ్యులు గాదిరాస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు.