‘పొత్తు’ చెడితే..!?
బీఎంసీలో ‘మహా’ సంశయం..
- ‘సీట్ల సర్దుబాటు’ వ్యవహారంతో ఆందోళనలో మహాకూటమి కార్పొరేటర్లు
- కూటమి విడిపోతే ‘బీఎంసీ’ పరిస్థితిపై మల్లగుల్లాలు
సాక్షి, ముంబై: ‘కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం..’ అనే సామెత చందంగా తయారైంది బీఎంసీలోని అధికార కూటమి పరిస్థితి.. సీట్ల సర్దుబాటుపై శివసేన, బీజేపీ నేతృత్వంలోని మహాకూటమిలో ఇంతవరకు సయోధ్య కుదరకపోవడంతో మహానగర పాలక సంస్థ (బీఎంసీ)లో ‘మహాకూటమి’ కార్పొరేటర్లు ఆందోళనకు గురవుతున్నారు. గత 15 రోజులుగా ఇరు పార్టీల నాయకుల మధ్య చర్చలు ప్రత్యక్షంగా జరగకపోయినా మీడియా లేదా లేఖల ద్వారా ప్రతిపాదనలు కొనసాగుతున్నాయి. దీంతో ఈ సమస్య ఎటూ పరిష్కారం కావడంలేదు. కాగా, దీని ప్రభావం బీఎంసీ పరిపాలన విభాగం పడే ఆస్కారముంది. బీఎంసీలో మహాకూటమి అధికారంలో ఉంది. పొత్తు ఉంటుందా..? ఊడుతుందా..? ఒకవేళ పొత్తు ఊడిపోతే బీఎంసీలో అధికారం శివసేన, బీజేపీ వద్ద ఉంటుందా...? లేక ఇక్కడ కూడా తెగతెంపులు చేసుకుని ఎవరి దారివారు చూసుకుంటారా...? అప్పుడు తమ పరిస్థితి ఏంటి..? ఇలా అనేక సందేహాలతో కొర్పొరేటర్లు మల్లగుల్లాలు పడుతున్నారు.
బీఎంసీలో మొత్తం 227 వార్డులున్నాయి. అధికారం చేజిక్కించుకోవాలంటే 114 మంది కార్పొరేటర్లు తప్పనిసరి కావాలి. కాని గత బీఎంసీ ఎన్నికల్లో ఏ కూటమికీ పూర్తి మెజార్టీ రాలేదు. బీఎంసీలో ప్రస్తుతం శివసేన-75, బీజేపీ-31, కాంగ్రెస్-52, ఎన్సీపీ-13, ఎమ్మెన్నెస్-28, సమాజ్‌వాది పార్టీ-9, అఖిల భారతీయ సేన-2, బీఆర్పీ-1, ఆర్పీఐ-1, ఇండిపెండెంట్లు-15 మంది సభ్యులున్నారు. ఇందులో శివసేన, బీజేపీ, ఆర్పీఐ కూటమి ఇద్దరు అఖిల భారతీయ సేన, 15 మంది ఇండిపెండెంట్లను కలుపుకొని అధికారంలోకి వచ్చింది.
కాని ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఒకవేళ పొత్తు కుదరక మహాకూటమి చీలిపోతే బీఎంసీలో బలాబలాలను బట్టి చూస్తే బీజేపీ లేకుండా శివసేనకు 114 మేజిక్ ఫిగర్‌కు చేరుకోవడం ఒక సవాలుగా మారనుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెన్నెస్, కాంగ్రెస్, ఎన్సీపీలతో జతకట్టడం సాధ్యం కాని పని. దీంతో మహాకూటమి సీట్ల సర్దుబాటు వ్యవహారం తమ సీట్ల కిందకు నీళ్లు తెచ్చేలా ఉందని కార్పొరేటర్లు ఆందోళనలో చెందుతున్నారు.