ఎడతెగని క్యాంపా..గోల..!
సాక్షి, ముంబై: క్యాంపాకోలా భవన సముదాయంలో అక్రమంగా నిర్మించిన 140 ఫ్లాట్లకు మంచినీరు, గ్యాస్ కనెక్షన్లను నిలిపివేసేందుకు శుక్రవారం వచ్చిన అధికారులను క్యాంపాకోలా వాసులు గేటు బయటే నిలువరించారు. మూడు గంటల పాటు హైడ్రామా అనంతరం అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండానే వెనుదిరిగారు. దీంతో క్యాంపాకోలా వాసులు తాత్కాలికంగా ఊరట పొందగలిగారు. ఈ నేపథ్యంలో ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చల్లోకెక్కిన వర్లీలోని క్యాంపాకోలా భవన సముదాయంలో శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
సుప్రీం కోర్టు ఇచ్చిన గడువు పూర్తికావడంతో క్యాంపాకోలా అక్రమ కట్టడాలను తొలగించనున్నట్టు నోటీసులు బీఎంసీ జారీచేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ విషయంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. తాము మంగళవారమే చర్యలు తీసుకుంటామని బీఎంసీ పేర్కొన్నప్పటికీ క్యాంపాకోలా నివాసి ఒకరు మరణించడంతో చర్యలను శుక్రవారానికి వాయిదా వేశారు. ఇలా ముందునుంచీ ప్రకటిస్తూ వచ్చిన ప్రకారం శుక్రవారం బీఎంసీ సిబ్బంది పోలీసు బలగాలతో గ్యాస్, విద్యుత్ కనెక్షన్‌లను తొలగించేందుకు ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో క్యాంపాకోలా సొసైటీ వద్దకి చేరుకున్నారు. ఓవైపు పోలీసులు, మరోవైపు క్యాంపాకోలా వాసులతోపాటు మీడియా, ఇతర ప్రజలతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున రద్దీ కన్పించింది.
అధికారులు వచ్చేసరికి క్యాంపాకోలా వాసులు కాంపౌండ్ గేటును మూసేసి అక్కడే బైఠాయించారు. దేవుళ్ల ఫొటోలు ఉంచి గేటు ముందు హోమాలు, యాగాలు చేశారు. ఇలా క్యాంపాకోలా వాసులనుంచి బీఎంసీ అధికారులకు తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. బాధితుల నినాదాలతో పరిసరాాలు మారుమోగాయి. సుమారు మూడు గంటలపాటు ఆ ప్రాంతంలో హైడ్రామా నడిచింది. బీఎంసీ అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లేంతవరకు కాంపౌండ్ నివాసులు తమ ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నారు. క్యాంపాకోలా వాసుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో బీఎంసీ అధికారులు చివరికి వెనుదిరిగారు.
మహాకూటమి మద్దతు...
క్యాంపాకోలా నివాసులకు మహాకూటమి మద్దతుగా నిలిచింది. శివసేన, బీజేపీ, ఆర్‌పిఐకి చెందిన పలువురు కార్యకర్తలు ఘటన స్థలానికి చేరుకున్నారు. బీఎంసీ చర్యలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. వీరిలో 12 మంది ఆర్‌పిఐ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం...
క్యాంపాకోలా వాసులపై చర్యలు నిలిపివేయలేదని బీఎంసీ అధికారులు పేర్కొన్నారు. ఘటన స్థలంలో చర్యలు చేపట్టేందుకు వచ్చిన అధికారులు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశామని కాని వారు విన్పించుకోలేదని చెప్పారు. ఎట్టిపరిస్థితిల్లోనూ చర్యలు తీసుకోకతప్పదన్నారు. ఈ విషయం కాలనీవాసులకూ తెలుసని అయినప్పటికీ వ్యతిరేకిస్తున్నారని బీఎంసీ సిబ్బంది పేర్కొన్నారు. మరోవైపు ఈ విషయంపై ఉన్నతాధికారులతో చర్చించి మళ్లీ చర్యలు ఎప్పుడు చేపట్టనున్నదనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నామన్నారు.
1986లో వెలుగులోకి...
1980 ప్రాంతంలో క్యాంపాకోలా భవన సముదాయాన్ని నిర్మించారు. అందులో అక్రమ అంతస్తులను నిర్మించినట్టు తెలుసుకున్న బిఎంసీ 1986లో బిల్డర్‌కు రూ. 6.60 లక్షల జరిమానా విధించింది. బిల్డర్ ఆ సొమ్ము చెల్లించిన అనంతరం మళ్లీ రూ. 11.20 లక్షలు జరిమానా చెల్లించాలని బీఎంసీ నోటీసులు జారీ చేసింది. ఇది జరిగిన 15 ఏళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. అయితే 2000 సంవత్సరంలో ఇక్కడ ఉండేందుకు వచ్చినవారు అధికారికంగా నీటి కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో మరోసారి బీఎంసీ ఈ విషయంపై దృష్టి సారించింది. అక్రమ ఫ్లాట్లపై చర్యలు తీసుకోనున్నట్టు నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులపై క్యాంపాకోలా నివాసులు కోర్టును ఆశ్రయించారు. ముంబై హైకోర్టుతోపాటు సుప్రీం కోర్టులో కూడా క్యాంపాకోలా వాసులకు ఊరట లభించలేదు. వారికి వ్యతిరేకంగానే తీర్పువచ్చింది.
140 ఫ్లాట్లు అక్రమం..?
క్యాంపాకోలా భవన సముదాయంలో మొత్తం ఏడు భవనాలున్నాయి. వీటిలో మొత్తం 35 అంతస్తులు అక్రమంగా నిర్మించారు. వీటిలోని 140 ఫ్లాట్లను కూల్చేసేందుకు గత ఏడాది 2013 నవంబర్‌లో బీఎంసీ యత్నించింది. అయితే అన్ని పార్టీలు ఈ విషయంపై వీరికి మద్దతుకు ముందుకువచ్చాయి. మానవతా దృక్పథంతో సుప్రీంకోర్టు కూడా వీరికి ఏడు నెలల గడువు ఇచ్చింది. అయితే ఆ గడువు మే 31వ తేదీతో ముగిసింది. దీంతో మళ్లీ క్యాంపాకోలాపై చర్యలు తీసుకునే ప్రక్రియను బీఎంిసీ ప్రారంభించింది.