ఆర్‌ఎల్‌డీలోకి అమర్, జయప్రద
- ఫతేపూర్ నుంచి అమర్.. బిజనూర్ నుంచి జయ పోటీ!
- ఆంధ్రాను వీడి కర్మభూమికి వచ్చా: జయప్రద
సాక్షి, న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ బహిష్కృత నేతలు అమర్‌సింగ్, జయప్రదలు రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డీ)లో చేరారు. పార్టీ మార్పుపై గత కొన్ని నెలలుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ సోమవారం ఆర్‌ఎల్‌డీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ అధినేత అజిత్ సింగ్ ఇరువురు నేతలను పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. రాంపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జయప్రదకు బిజ్‌నౌర్, అమర్‌సింగ్‌కు ఫుతేపుర్ స్థానాలు కేటాయించనున్నట్టు సంకేతాలు అందాయి. వీరి చేరిక సందర్భంగా ఇక్కడి అజిత్‌సింగ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జయప్రద మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ద్వారా మొదలైన రాజకీయ జీవితాన్ని యూపీకి సమర్పించినట్టు చెప్పారు.
అలా ఆంధ్రాను వదిలి ఉత్తరప్రదేశ్‌లోని కర్మభూమిలో పనిచేయడానికి వచ్చానన్నారు. అమర్‌సింగ్ ఏ పార్టీలో ఉంటే, తాను కూడా అదే పార్టీలో ఉంటానని స్పష్టంచేశారు. ‘‘ఆర్‌ఎల్‌డీలో అవకాశం ఇచ్చిన అజిత్‌సింగ్, అమర్‌సింగ్‌కు ధన్యవాదాలు. లోక్‌సభలో ఎంపీగా ఉన్న నేపథ్యంలో అజిత్‌ను కలిసి అనేక విషయాల్లో సలహాలు తీసుకున్నాను. నేను ఆర్‌ఎల్‌డీలో లేనప్పటికీ, ఆయన మంచి సలహాలు ఇచ్చి నాకు తోడ్పాటుగా ఉండేవారు. యూపీ విభజన, అభివృద్ధి విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటున్న అజిత్ నేతృత్వంలో ఉత్తరప్రదేశ్ ప్రజలను, పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తా’’ అని చెప్పారు. అమర్‌సింగ్ తన జీవితాన్ని సమాజ్‌వాదీ పార్టీకి అంకితం చేసినప్పటికీ, ఆయనకు ఆ పార్టీ అధినేత (ములాయం) తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు సరైన సమయంలో ఆర్‌ఎల్‌డీలో చేరామని జయప్రద వెల్లడించారు.
కష్టమ్మీద తెలంగాణ ఇచ్చారు: అమర్‌సింగ్
దేశంలోని రెండు పెద్ద పార్టీలు తెలంగాణపై సీరియస్‌గా లేవని అమర్‌సింగ్ ఆరోపించారు. ఆ పార్టీలు అతి కష్టమ్మీద తెలంగాణ ఇచ్చాయని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుతో ఇప్పుడు యూపీలో విభజన మార్గం సులువవుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమం కొనసాగిన సమయంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో అజిత్‌సింగ్ తరచుగా సంప్రదింపులు జరిపేవారని మీడియాకు వెల్లడించారు.