‘టిక్‌టాక్‌’ విశేషాలెన్నో! | Amazing popularity of TikTok in India | Sakshi
Sakshi News home page

‘టిక్‌టాక్‌’ విశేషాలెన్నో!

Published Sat, Nov 9 2019 4:39 PM | Last Updated on Sat, Nov 9 2019 4:49 PM

Amazing popularity of TikTok in India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నేడు సోషల్‌ మీడియా అన్నింటిలోకెల్లా ‘టిక్‌ టాక్‌’ యాప్‌ భారత్‌లో అతి వేగంగా విస్తరిస్తోంది. వినోద ప్రధానమైన ఈ యాప్‌ను చైనా డెవలపర్‌ బైట్‌ డాన్స్‌ 2017లోనే ప్రవేశపెట్టినప్పటికీ భారత్‌లోకి 2018 జనవరిలో అడుగు పెట్టింది. అప్పటి నుంచి 2019, ఆగస్టు నాటికి 18 నెలల కాలంలోనే ఇది భారత్‌లోని అన్ని స్మార్ట్‌ఫోన్లలో 30 శాతానికి విస్తరించింది. దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్న వారంతా 18–35 ఏళ్ల లోపు వారవడం విశేషం. వారంతా కూడా టూ టైర్, త్రీటైర్‌ నగరాలకు చెందిన వారే అవడం మరో విశేషమని ‘కాలాగాటో’ వ్యాపార విశ్లేషణా సంస్థ తెలియజేసింది. 

‘టిక్‌టాక్‌’ వినియోగదారుల్లో అధిక జీతాలు అందుకునే వారు కాకుండా తక్కువ జీతాలు అందుకునే వారే ఎక్కువగా ఉండడం ఇంకో విశేషం. భారత టిక్‌టాక్‌ యూజర్లలో 52 శాతం మంది నెలకు 25 వేల రూపాయల లోపు సంపాదించేవారే! వీరందరికి ఈ రోజుల్లో అతి తక్కువ ఖర్చుతో వినోదం లభించడమే కాకుండా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించుకునేందుకు, తద్వారా తన తోటి సమాజంలో ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి ‘టాక్‌టాక్‌’  తోడ్పడుతుండడంతో ఆదరణ పెరుగుతోంది. జియో కారణంగా ఇంటర్నెట్‌ ధరలు దిగివస్తున్న పరిస్థితుల్లో ‘టిక్‌టాక్‌’  రావడం దాన్ని సక్సెస్‌కు ఒక కారణమని చెప్పవచ్చు.

టిక్‌టాక్‌లో అతి తక్కువ వీడియో, అంటే 15 సెకండ్ల ఫార్మట్‌ ఉపయుక్కంగా ఉండడం, ఔత్సాహిక నటులు, డ్యాన్సర్లు, ఇతర పర్ఫామర్లకు తొందరగా గుర్తింపు రావడానికి దోహద పడడం కూడా దీని ప్రాచుర్యాన్ని పెంచింది. అన్ని యాప్స్‌కన్నా టిక్‌టాక్‌ కోసమే భారతీయులు ఎక్కువ సమయాన్ని కేటాయించడం కూడా విశేషమనే చెప్పవచ్చు. ‘లైకీ, ఇన్‌స్టాగ్రామ్, హెలో, స్నాప్‌చాట్‌లకన్నా ఎక్కువగా యూజర్‌ సరాసరి 30 నిమిషాలపాటు టిక్‌టాక్‌కు కేటాయిస్తున్నారు. స్నాప్‌చాట్‌కు సరాసరి 9.5 నిమిషాలు మాత్రమే కేటాయిస్తున్నారు. 

గత సెప్టెంబర్‌ నెలలో ప్రపంచంలో అన్ని యాప్‌లకన్నా ఎక్కువగా టిక్‌టాక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. వాటిలో 44 శాతం భారత్‌లోనే జరగడం కూడా విశేషమే. టిక్‌టాక్‌కు పోటీగా గత సెప్టెంబర్‌ నెలలోనే ‘ఫైర్‌వర్క్‌’ అనే మరో వీడియో షేరింగ్‌ యాప్‌ వచ్చింది. సిల్లీ జోకులు, సిల్లీ లిప్‌ సింకింగ్‌ వీడియోలను తీసుకోమని స్పష్టం చేసిన ‘ఫైర్‌వర్క్‌ ఇండియా’ సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీల్‌ నాయర్, ఇప్పుడు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement