
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: 2019 సాధారణ ఎన్నికలపై బీజేపీ కసరత్తులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే సిట్టింగ్ ఎంపీల క్షేత్రస్థాయి పనితీరుపై నివేదికలు తెప్పించుకుని సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో వెల్లడైన అంశాల ద్వారా 60కిపైగా సిట్టింగ్ ఎంపీల పనితీరు దారుణంగా ఉందని నిర్ణయించారని పార్టీ వర్గాలంటున్నాయి. వీరికి వచ్చే ఎన్నికల్లో సీట్లు దక్కకపోవచ్చని తెలుస్తోంది. ఈ నివేదికల్లో నియోజకవర్గంలో పనితీరు, ప్రజాభిమానం, వ్యతిరేకత, ఎంపీల్యాడ్స్ నిధుల వినియోగం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిసింది.
ఈ 60మందికి పైగా ఉన్న జాబితాలో సీనియర్ ఎంపీలతోపాటు పలువురు కేంద్ర మంత్రులు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలంటున్నాయి. ప్రదర్శన సరిగా లేని కారణంగా వచ్చే ఎన్నికల బరిలోనుంచి తప్పించే ఎంపీల జాబితాపై వార్తలు రావటంతో.. పలువురు ఎంపీలు అమిత్ షా వద్ద క్యూలు కడుతున్నారు. నియోజకవర్గంలో, బయటా తమ సమస్యలను షాతో ఏకరువు పెడుతున్నారు. ఇలాంటి వారందరికీ అమిత్ ప్రత్యేక సూచనలు ఇస్తున్నట్లు తెలిసింది. నియోజకవర్గంలో పనితీరును మెరుగుపరుచుకునేందుకు ఏం చేయాలి, ఏం చేయకూడదనే అంశాలను బోధిస్తున్నట్లు తెలిసింది.
మూడున్నరేళ్లుగా వివిధ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ ఎంపీలకు కొన్ని బాధ్యతలు కట్టబెట్టారు. ఇందులో చాలా మంది ఎంపీలు విఫలమయ్యారు. శీతాకాల సమావేశాల సందర్భంగా పలువురు ఎంపీలు ప్రధాని, అమిత్ షాలను కలిసి నియోజకవర్గాల్లో చేపట్టే పనులకు నిధులు కావాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాలు పెంచిన సమయంలో చాలా మంది ఎంపీలు ఈ బిల్లును ఆమోదించేందుకు విముఖత వ్యక్తం చేశారని.. ముందుగా తమ వేతనాలు పెంచాలని అడిగారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment