కోల్‌కతా : దేశాన్ని విభజించి శాంతిని అడ్డుకునే వారి వెన్నులో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్‌ఎస్‌జీ) వణుకు పుట్టించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అలాంటి శక్తులతో పోరాడి వాటిని అంతమొందించే బాధ్యత ఎన్‌ఎస్‌జీదేనని అన్నారు. కోల్‌కతాలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పాలనా పగ్గాలు చేపట్టిన అనంతరం తాము చురుకైన సమర్ధవంతమైన రక్షణ విధానాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు.
మెరుపు దాడులను విజయవంతంగా చేపట‍్టడం ద్వారా అమెరికా, ఇజ్రాయిల్ వంటి దేశాల సరసన భారత్ చేరిందని అన్నారు. యావత్ ప్రపంచంలో శాంతిని భారత్ కోరుకుంటుందని, ఏ ఒక్కరిపైనా భారత్ ఎన్నడూ దాడి చేయదని, కానీ మన శాంతిని విచ్ఛిన్నం చేసి మన సైనికుల ప్రాణాలను బలిగొంటే మాత్రం వారికి దీటుగా బదులిస్తుందని స్పష్టం చేశారు. కాగా నిరసనల నడుమ ఆదివారం ఉదయం కోల్‌కతాకు చేరుకున్న అమిత్ షా ఏప్రిల్‌లో జరిగే మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కోల్‌కతాలో జరిగే భారీ ర్యాలీతో శ్రీకారం చుట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment