
సీఏఏ అమలు చేసి తీరతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
జబల్‌పూర్ : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)లో ఏ ఒక్క భారతీయుడి పౌరసత్వాన్ని అయినా తొలగించే నిబంధన ఎక్కడ ఉందో చెప్పాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సవాల్ విసిరారు. జబల్‌పూర్‌లో ఆదివారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ పార్లమెంట్‌లో ఆమోదం పొంది చట్టరూపు దాల్చిన సీఏఏను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. పౌర చట్టంపై ప్రజలను తప్పుదారి పట్టించేలా కాంగ్రెస్ సహా విపక్షాలు దుష్ర్పచారం సాగిస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
అణిచివేతకు గురైన పాకిస్తానీ శరణార్ధులందరికీ భారత పౌరసత్వం ఇచ్చే వరకూ నరేంద్ర మోదీ ప్రభుత్వం విశ్రమించదని తేల్చిచెప్పారు. దేశ విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని మత ప్రాతిపదికన విభజించిందని, పాక్ నుంచి వచ్చే మైనారిటీ శరణార్ధులకు భారత పౌరసత్వం కల్పిస్తామని నాటి నేతలు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. తూర్పు, పశ్చిమ పాకిస్తాన్‌లో నివసించే హిందువులు, సిక్కులు, పార్శీలు, జైన్‌లు భారత్‌కు తిరిగి రావాలని కోరుకుంటున్నారని అన్నారు. దేశ విభజన సమయంలో పాకిస్తాన్‌లో 30 శాతంగా ఉన్న హిందువుల జనాభా నేడు 3 శాతానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.