న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) ప్రక్రియను ప్రారంభిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం రాజ్యసభలో ప్రకటించారు. ఈ జాబితా రూపకల్పనలో మతపరమైన వివక్షలు ఉండవన్నారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నసీర్‌అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా అమిత్ మాట్లాడారు.
‘అస్సాం తరహాలో జాతీయ పౌర రిజిస్టర్‌ను దేశవ్యాప్తంగా తీసుకువస్తాం. ఏ మతం వారూ భయపడాల్సిన పని లేదు. ఎన్‌ఆర్‌సీ గొడుగు కిందకి అందరినీ తీసుకురావడమే దీని ఉద్దేశం. సుప్రీం కోర్టు పర్యవేక్షణలోనే ఈ ప్రక్రియ సాగుతుంది’ అని అన్నారు. ‘ఏ మతానికి చెందిన వారైనా భారతీయ పౌరులందరికీ ఈ జాబితాలో స్థానం లభిస్తుంది. ఈ అంశంలో ఎలాంటి వివక్షలకు తావు లేదు’ అని అమిత్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ రిజిస్టర్‌ను రూపొందిస్తే అస్సాంను అందులో కలుపుతామన్నారు.
ఎన్‌ఆర్‌సీ, పౌరసత్వ సవరణ బిల్లు వేర్వేరు
జాతీయ పౌర రిజిస్టర్‌కు, పౌరసత్వ సవరణ బిల్లుకు మధ్య తేడా ఉందన్నారు. హిందువులు, బౌద్ధులు, జైన్లు, క్రిస్టయన్లు, సిక్కులు, పార్సీలు ఎవరైనా కానివ్వండి ఆశ్రయం కోరి వచ్చిన వారిని భారత్ అక్కున చేర్చుకుంటుందన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్‌లలో మతపరమైన అరాచకాలను భరించలేక భారత్‌కు శరణార్థులుగా వచ్చినవారికి జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు కింద పౌరసత్వం ఇస్తామని స్పష్టం చేశారు. జాతీయ పౌరసత్వ బిల్లుని లోక్‌సభ ఆమోదించిందని, సెలెక్ట్ కమిటీ ఆమోదించాక సభ రద్దయిందని, త్వరలో ఈ బిల్లు మళ్లీ సభ ముందుకు వస్తుందని వివరించారు. పౌరసత్వ సవరణ బిల్లుకి, జాతీయ పౌర రిజిస్టర్‌కు సంబంధం లేదని స్పష్టం చేశారు.
బెంగాల్‌లో అనుమతించం: మమత
దేశవ్యాప్తంగా జాతీయ పౌర రిజిస్టర్‌ను తయారు చేస్తామన్న కేంద్రం ప్రకటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ మండిపడ్డారు. ‘ నేను అధికారంలో ఉన్నంత వరకు ఎన్‌ఆర్‌సీకి అనుమతించను’ అని సగార్దిఘిలో ఒక బహిరంగ సభలో చెప్పారు.‘మీ పౌరసత్వాన్ని ఎవరూ లాక్కోలేరు. మిమ్మల్ని శరణార్థులుగా మార్చలేరు’ అని బెంగాలీలకు హామీ ఇచ్చారు.
కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు: అమిత్ షా
జమ్ము కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు యధావిధిగా పనిచేస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు.
అస్సాం ఎన్‌ఆర్‌సీ ప్రక్రియపై ఆందోళన
వాషింగ్టన్: అస్సాంలో రూపొందించిన జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) ప్రక్రియపై అమెరికాకు చెందిన కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియతో భారత్‌లో ఏళ్ల తరబడి స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న 19 లక్షల మంది పౌరసత్వాన్ని కోల్పోనున్నారని పేర్కొంది. సరైన నియంత్రణ , పారదర్శకత లేకుండా ఎన్‌ఆర్‌సీ ప్రక్రియను చేపట్టడం వల్ల అసలు సిసలు భారతీయులకే దేశంలో చోటు లేకుండా ప్రమాదం ముంచుకొస్తోందని తన నివేదికలో పేర్కొంది. అస్సాంలో ముస్లింలను లక్ష్యంగా చేసుకొని, వారిని రాష్ట్రం నుంచి పంపించేయడానికే ఎన్‌ఆర్‌సీ ప్రక్రియను నిర్వహించారని యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ కమిషనర్ అనురిమ భార్గవ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment