
‘డిజిటల్’ అధ్యయనానికి కమిటీ
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత (డిజిటల్) లావాదేవీల అమలుపై అధ్యయనానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కన్వీనర్‌గా నీతి ఆయోగ్ బుధవారం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
- కన్వీనర్‌గా ఏపీ సీఎం చంద్రబాబు
- సభ్యులుగా మరో ఐదుగురు సీఎంలు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్
- ప్రత్యేక ఆహ్వానితులుగా పలువురు నిపుణులు
- కమిటీ విధి విధానాలు రూపొందించిన నీతి ఆయోగ్
సాక్షి, న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత (డిజిటల్) లావాదేవీల అమలుపై అధ్యయనానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కన్వీనర్‌గా నీతి ఆయోగ్ బుధవారం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో వివిధ పార్టీలకు చెందిన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సంబంధిత అంశంలో నిపుణులు మొత్తం 13 మంది ఉన్నారు. ఒడిశా, మధ్యప్రదేశ్, సిక్కిం, పుదుచ్చేరి, మహారాష్ట్రల ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్, శివ్‌రాజ్ సింగ్ చౌహాన్, పవన్ కుమార్ చామ్లింగ్, వి.నారాయణ స్వామి, దేవేంద్ర ఫడ్నవిస్‌తో పాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా కమిటీలో సభ్యులుగా ఉంటారు. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) మాజీ చైర్మన్ నందన్ నిలేకని, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ చైర్మన్ జన్మేజయ సిన్హా, నెట్‌కోర్ మేనేజింగ్ డెరైక్టర్ రాజేశ్ జైన్, ఐ స్పిరిట్ సహ వ్యవస్థాపకుడు శరద్ శర్మ , ఐఐఎం (అహ్మదాబాద్) ఫ్రొఫెసర్ (ఫైనాన్‌స) డాక్టర్ జయంత్ వర్మ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. ఈ కమిటీ సబ్ గ్రూపులను నియమించుకోవచ్చు. అలాగే సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుంది.
కమిటీ విధివిధానాలు ఇవీ..
► నగదు రహిత లావాదేవీలకు అంతర్జాతీ యంగా అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను గుర్తించి వాటిని దేశంలో అమలు చేసేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి.
► డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ వంటి కార్డుల ద్వారా, డిజిటల్ వ్యాలెట్, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ), బ్యాంకింగ్ యాప్‌ల వంటి చెల్లింపు విధానాలను ఏడాది కాలంలో వేగవంతంగా విసృ్తత పరిచేందుకు గల అవకాశాలను గుర్తించాలి.
► డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యాచరణ రూపొందించాలి.
► రాష్ట్రాల పాలన యంత్రాంగాలు నగదు రహిత లావాదేవీలను అనుసరించేందుకు ఒక కార్యాచరణ రూపొందించాలి.
► నగదు రహిత లావాదేవీలను అనుసరించడంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం కను గొనాలి.
► డిజిటల్ చెల్లింపుల ఆర్థిక వ్యవస్థ అమలుకు సంబంధిత భాగస్వాము లతో చర్చించాలి.
► ఈ అంశంలో నియమిత అధికారుల కమిటీ చేసిన సూచనలకు ఒక రూపమిచ్చి అమలులోకి తేవాలి.
►ఇక్కడ ప్రస్తావించని అంశాలు ఇంకా ఏవైనా నగదు రహిత లావాదేవీలతో ముడిపడి ఉంటే వాటిని కూడా పరిశీలించాలి.