న్యూఢిల్లీ: ఇకపై సివిల్ సర్వీసెస్ పరీక్షలకు దరఖాస్తు చేసినా దానిని ఒక ప్రయత్నం (అటెంప్ట్)గానే పరిగణించాలని యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) తాజాగా ప్రతిపాదించింది. నిబంధనల ప్రకారం ఏ కులపరమైన రిజర్వేషన్లూ లేని అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసేందుకు ఆరుసార్లు మాత్రమే ప్రయత్నించొచ్చు (ఆరు అటెంప్ట్‌లు). నిర్దేశిత వయసు నిబంధనలకు లోబడి ఓబీసీలు అయితే 9 సార్లు, ఎస్సీ, ఎస్టీలు ఎన్నిసార్లైనా సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసుకోవచ్చు. అయితే ప్రస్తుతం దరఖాస్తు చేశాక, అభ్యర్థి కనీసం ప్రాథమిక పరీక్షలోని ఒక్క పేపర్‌కైనా హాజరైతేనే దానిని ప్రయత్నం (అటెంప్ట్)గా పరిగణిస్తున్నారు.
మరోవైపు పరీక్ష ఫీజు తక్కువగా ఉండటం, అందరు మహిళా అభ్యర్థులతోపాటు ఎస్సీ, ఎస్టీలు, వికలాంగులు తదితరులకు అస్సలు ఒక్క రూపాయి కూడా ఫీజు లేకపోవడంతో లక్షల సంఖ్యలో యూపీఎస్సీకి దరఖాస్తులు వస్తున్నా పరీక్షకు మాత్రం వారిలో సగం మందే హాజరవుతున్నారు. యూపీఎస్సీ మాత్రం దరఖాస్తు చేసిన వారందరికీ ప్రశ్నపత్రాలను ముద్రించడం, పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం కోసం ఖర్చు భారీగా అవుతోంది.దరఖాస్తును కూడా ప్రయత్నంగానే పరిగణిస్తే అభ్యర్థులకు అవకాశాలు తగ్గిపోతాయి కాబట్టి నిజంగా పరీక్ష రాయాలనుకునే వారే దరఖాస్తు చేస్తారనేది యూపీఎస్సీ వాదన. 2016లో 11.35 లక్షల దరఖాస్తులు రాగా 4.59 లక్షల మంది మాత్రమే ప్రాథమిక పరీక్షలు రాశారు.
Comments
Please login to add a commentAdd a comment