సోనియా, రాహుల్కు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి ఊరట లభించింది. పాటియాల హౌస్ కోర్టు శనివారం వీరిరువురికి బెయిల్ మంజూరు చేసింది. సోనియా, రాహుల్ తరఫున మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ బెయిల్ పత్రాలు సమర్పించారు. ఆ పత్రాలను పరిశీలించిన చెరో 50 వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
సోనియా తరఫున సీనియర్ నేత ఏకే ఆంటోనీ, రాహుల్ గాంధీ తరఫున సోదరి ప్రియాంకా వాద్రా ష్యూరిటీ పత్రాలపై సంతకాలు చేశారు. అంతకుముందు సోనియా, రాహుల్‌లకు బెయిల్ ఇవ్వొద్దని పిటిషనర్ సుబ్రమణ్యస్వామి వాదించారు. శ్యామ్ పిట్రోడాపై నాన్ బెయిల్ వారెంట్ జారీ చేయాలని కోరారు. కాగా సోనియా, రాహుల్ తరఫున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు సోనియా, రాహుల్ గాంధీలకు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను 2016 ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది.