కోర్టులో 5 నిమిషాలు మాత్రమే...
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో తొలిసారిగా కోర్టు మెట్లు ఎక్కిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కేవలం 5 నిమిషాలు మాత్రమే న్యాయస్థానంలో ఉన్నారు. ఈ కేసులో వాదనలు అయిదు నిమిషాల్లోనే ముగిశాయి. పాటియాల హౌస్ కోర్టులో శనివారం సోనియా, రాహుల్ తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. సోనియా, రాహుల్తో సహా ఈ కేసులో ఏడుగురికి బెయిల్ మంజూరు అయింది.
మరోవైపు కేసు విచారణ సందర్భంగా కోర్టు హాల్ కిక్కిరిసిపోయింది. కాగా సోనియా కుమార్తె ప్రియాంకా వాద్రా, అల్లుడు రాబర్ట్ వాద్రాలు సోనియా కంటే ముందుగానే కోర్టుకు వచ్చారు. కాగా ఈ కేసుకు సంబంధించి రాహుల్, సోనియాలు బెయిల్ తీసుకుంటారా, అరెస్ట్ అవుతారా అనే దానిపై కాంగ్రెస్ పార్టీ చివరివరకూ వ్యూహత్మకంగా వ్యవహరించింది.
కేసు విచారణ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, మాజీ స్పీకర్ మీరా కుమార్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, అభిషేక్ మను సింఘ్వీ, కపిల్ సిబల్ సహా పలువురు కాంగ్రెస్ అగ్ర నేతలుతో పాటు పార్టీ శ్రేణులు కూడా పటియాలా హౌజ్ కోర్టుకు తరలి వచ్చారు. హేమాహేమీలు తరలిరావడం, గాంధీ కుటుంబానికి సంబంధించిన కేసు విచారణ కావడంతో కోర్టు పరిసరాల్లో గట్టి భద్రత ఏర్పాటు చేశారు. కోర్టులో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన పోలీసులు కోర్టు పరిసరాల్లో భారీగా బలగాలను రంగంలోకి దింపారు. ఎస్పీజీ సిబ్బంది కోర్టు ప్రాంగణాన్ని అదుపులోకి తీసుకొని ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులు, పారామిలటరీ బలగాలను మోహరించారు.