చివరకు న్యాయమే గెలుస్తుంది: సోనియా
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, అయితే చివరకు న్యాయమే గెలుస్తుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. దేశ పౌరులుగా ఏం చేయాలో తాము అదే చేశామన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్ మంజూరు అనంతరం సోనియా, రాహుల్ శనివారం ఏఐసీసీ కార్యాలయం వద్ద ప్రెస్మీట్లో మాట్లాడారు. చట్టాన్ని తాము గౌరవిస్తామని, కోర్టులో న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని సోనియా అన్నారు.
ప్రతిపక్షాన్ని ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని, కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆమె ఆరోపించారు. కేసులకు భయపడేది లేదని సోనియా స్పష్టం చేశారు. తాము స్వచ్ఛమైన మనసుతో కోర్టుకు హాజరయ్యామని ఆమె తెలిపారు. రాజకీయ ప్రతికార చర్యలను తాము ధైర్యంగా ఎదుర్కొంటామని సోనియా పేర్కొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందన్నారు. కేంద్రం తమపై అన్నిరకాల అస్త్రాలు ప్రయోగిస్తుందన్నారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ తాము చట్టాన్ని గౌరవిస్తామని అన్నారు. ప్రధాని మోదీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, బెదిరింపులకు వెనకడుగు వేసేది లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. తమపై ఒత్తిడి తేవాలని ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని, ఆ ఒత్తిళ్లకు లొంగకపోవడంతో కేసులు బనాయిస్తున్నారన్నారు. ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు పన్నినా... ప్రజల కోసమే తమ పోరాటం సాగుతుందని, ప్రతిపక్షంగా తమ పాత్ర తాము పోషిస్తున్నామన్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ కక్ష సాధింపు చర్యలతో ప్రతిపక్షాన్ని అణచలేరన్నారు. కాంగ్రెస్ ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటుందన్నారు. సోనియా, రాహుల్కు కాంగ్రెస్ పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ భావ జాలాన్ని తాము ఎన్నడూ వీడేది లేదన్నారు. మరోవైపు సోనియా, రాహుల్కు బెయిల్ మంజూరు కావటంతో ఏఐసీసీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.