![ఆర్మీలో మరో వీడియో కలకలం](/styles/webp/s3/article_images/2017/09/5/51488869250_625x300.jpg.webp?itok=dDjaxm8o)
ఆర్మీలో మరో వీడియో కలకలం
న్యూఢిల్లీ: వరుస వీడియోలతో భారత సైనికలు తమ సమస్యలను బయట పెడుతున్నారు. గతంలో సరిహద్దులో పనిచేస్తున్న సైనికుల పరిస్థితి దారుణంగా ఉందని, నాణ్యమైన భోజనం కూడా పెట్టడం లేదని తేజ్ బహదూర్ యాదవ్ అనే బీఎస్‌ఎఫ్ జవాను సోషల్ మీడియా ద్వారా వీడియోను విడుదల చేసి సంచలనం సృష్టించగా తాజాగా మరో సైనికుడు అదే బాట పట్టాడు.
సెలవుపై ఇంటికెళ్లి ఆలస్యంగా వచ్చినందుకు తనపై అధికారికింద సహాయక్ నియమించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని పీఎంవోకు, రక్షణశాఖ దృష్టికి తీసుకెళ్లిందుకు తనపై ఉన్నతాధికారులు కక్ష పూరిత చర్యలకు దిగారని ఆరోపించాడు. సింధవ్ జోగుదాస్ అనే వ్యక్తి భారత ఆర్మీలో సైనికుడిగా పనిచేస్తున్నాడు. అతడు ఈ మధ్య కాలంలోనే సెలవులపై ఇంటికెళ్లి ఆలస్యంగా వచ్చాడు. ఈ నేపథ్యంలో అతడికి శిక్షగా సహాయక్‌గా నియమించారు. దీనిపై కలత చెందిన సింధవ్.. ఆర్మీ అంటే కేవలం అధికారులకు సేవచేయించడమే ఆనవాయితీగా మారిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను చేసిన ఆరోపణలను భారత ఆర్మీ అంగీకరించదని తెలుసని, అయితే, ఇదే విషయాన్ని తమ సమస్యలు పరిష్కారం కోసం ఏర్పాటుచేసిన వాట్సప్ నెంబరుకు ఫిర్యాదు చేసినా సమాధానం రాలేదన్నాడు.
సహాయక్‌గా పనిచేయడానికి అంగీకరించక పోవడంతో ఏడురోజులుపాటు తనను అదుపులోకి తీసుకుని ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. ఈ విషయం పీఎంవోకు చెబితే సైనిక కోర్టు తప్పుబట్టిందని, అదే విషయాన్ని మరోసారి పీఎంవోకు, రక్షణ శాఖ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. నావిక దళం, వాయుసేనలో కూడా ఇలాంటి సహాయక్ వ్యవస్థ లేదని గుర్తు చేశాడు. గతంలో సహాయక్ వ్యవస్థపై స్ట్రింగ్ ఆపరేషన్ చేసి విమర్శించిన రేమాథ్యూ మహారాష్ట్ర డిలాలి కంటోన్మెంట్‌లో మృతిచెందిన విషయం తెలిసిందే.