ఆర్నబ్ గోస్వామికి భారీ భద్రత
న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామికి కేంద్ర ప్రభుత్వం 'వై' కేటగిరి భద్రత కల్పించింది. పాకిస్థాన్ కు చెందిన తీవ్రవాద సంస్థల నుంచి ముప్పు ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో ఆయనకు ప్రభుత్వం సెక్యురిటీ కల్పించిందని 'హిందూస్థాన్ టైమ్స్' వెల్లడించింది. ఆర్నబ్ గోస్వామికి 24 గంటల పాటు 20 మంది భద్రతా సిబ్బంది రక్షణ కల్పిస్తారు.
'ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారాన్ని విశ్లేషించిన తర్వాత ఆర్నబ్ కు భద్రత కల్పించాం. టైమ్స్ నౌ చానల్ లో పాకిస్థాన్ తీవ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో ఆయనను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నార'ని కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు చెప్పారు.
టైమ్స్ నౌ చానల్ లో ప్రైమ్ టైమ్ న్యూస్ డిబేట్ ద్వారా పాపులరయిన ఆర్నబ్.. ఉడీ దాడుల తర్వాత తీవ్రవాద సంస్థలు, పాకిస్థాన్ కు వ్యతిరేకంగా బలంగా గళం వినిపించారు. ఆర్నబ్ తో పాటు జీ న్యూస్ కు చెందిన సుధీర్ చౌధరీ(ఎక్స్ కేటగిరి), సమాచార్ ప్లస్ కు చెందిన ఉమేశ్ కుమార్(వై కేటగిరి), అశ్విని కుమార్ చోప్రా(జడ్ ప్లస్ కేటగిరి)లకు కేంద్రం భద్రత కల్పించింది.