అపెక్స్ కౌన్సిల్‌ను సమావేశపరచండి | Arrange the Apex Council | Sakshi
Sakshi News home page

అపెక్స్ కౌన్సిల్‌ను సమావేశపరచండి

Published Thu, Jul 21 2016 2:07 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

అపెక్స్ కౌన్సిల్‌ను సమావేశపరచండి - Sakshi

అపెక్స్ కౌన్సిల్‌ను సమావేశపరచండి

పాలమూరు, డిండి వివాదంపై కేంద్రానికి సుప్రీం ఆదేశం
- ఆ ప్రాజెక్టులకు అనుమతులు లేవన్న కేంద్రం
- డీపీఆర్‌ను అడిగినా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదని నివే దన
- అవి పాత ప్రాజెక్టులేనన్న తెలంగాణ
- కాదు కొత్తవే.. ఇంకా సర్వే కూడా పూర్తికాలేదన్న ఏపీ
 
 సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 84, 85, షెడ్యూలు 11ను పరిగణనలోకి తీసుకోవాలని, అలాగే అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరపాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రాసిన లేఖను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాల వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని నాగార్జునసాగర్ దిగువన గల ఆయకట్టు రైతులు ఆళ్ల గోపాలకృష్ణారావు, తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు బుధవారం విచారణ చేపట్టి ఈ ఆదేశాలు జారీచేసింది.

జస్టిస్ జగదీశ్ సింగ్ కెహర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ అరుణ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. తొలుత తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు. ఈ పిటిషన్లకు విచారణార్హతే లేదని, కాబట్టి వీటిని తిరస్కరించాలని కోరారు. నదీ జలాల వివాదాలతో రైతులకు ప్రత్యక్షంగా సంబంధం లేదని, రాష్ట్రాల మధ్య ఉండే వివాదాలు రాష్ట్రాలే తగిన వేదికల వద్ద పరిష్కరించుకోవాల్సి ఉంటుందని వాదించారు. ఈ సందర్భంగా జస్టిస్ అరుణ్ మిశ్రా జోక్యం చేసుకుంటూ నదీ జలాల వివాదాల పరిష్కారానికి సంబంధిత అత్యున్నత న్యాయ సంస్థలు ఉన్నాయని, వాటిని ఆశ్రయించడంలో ఇబ్బందులు ఏంటని ప్రశ్నించారు. ఇందుకు వైద్యనాథన్ స్పందిస్తూ సంబంధిత సంస్థలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదివరకే ఆశ్రయించిందని, పౌరులు నేరుగా వాటిని ఆశ్రయించలేరని వివరించారు.

 అనుమతులు లేవన్న కేంద్రం
 అయితే తెలంగాణ వాదనలపై కేంద్రం వైఖరి ఏంటని జస్టిస్ కెహర్ ప్రశ్నించారు. దీనికి కేంద్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది ఖాద్రీ స్పందిస్తూ సదరు రెండు ప్రాజెక్టులకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. చట్టంలో పొందుపరిచిన మేరకు సెక్షన్ 84, 85 ప్రకారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కే ఆర్‌ఎంబీ) వీటికి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని, కానీ అలాంటి అనుమతులు ఏవీ లేవని పేర్కొన్నారు. వీటి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను సమర్పించాలని కేఆర్‌ఎంబీ, కేంద్ర జల వనరుల సంఘం(సీడబ్ల్యూసీ)లు కోరినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని నివేదించారు. ఈవాదనలతో వైద్యనాథన్  విభేదించారు.

సదరు రెండు ప్రాజెక్టులు కొత్తవి కావని, పాతవేనని, అందువల్లే డీపీఆర్ సమర్పించలేదని తెలిపారు. దీంతో ఖాద్రీ స్పందిస్తూ ఈ రెండు ప్రాజెక్టులు పాతవి కావని, పాత ప్రాజెక్టులే అయితే ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని 11వ షెడ్యూలులో పొందుపరిచి ఉండేవారని వాదించారు. ఈ వాదనలతో వైద్యనాథన్ విభేదిస్తూ.. ‘ఉమ్మడి రాష్ట్రంలో మిగులు జలాలపై ఆధారపడి అనేక ప్రాజెక్టులు నిర్మించారు. అలాంటి ప్రాజెక్టులన్నింటినీ చట్టంలో పేర్కొనలేదు. పాలమూరు, డిండి ప్రాజెక్టులు మిగులు జలాలపై ఆధారపడి కడుతున్నవే. ఈ రెండు ప్రాజెక్టులు పాతవే. ఈ వివాదాన్ని తేల్చేందుకు అపెక్స్ కౌన్సిల్ ఉంది..’ అని పేర్కొన్నారు. అయితే.. 11వ షెడ్యూలులో పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలను ప్రస్తావించలేదని, అందువల్ల అవి కొత్త పథకాలే అవుతాయి కదా? అని జస్టిస్ కెహర్ ప్రశ్నించారు. తిరిగి వైద్యనాథన్ స్పం దిస్తూ ఆయా ప్రాజెక్టులకు సంబంధించి గతంలోనే ఉమ్మడి ప్రభుత్వం పాలనా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీచేసిందని, కొత్తవి కావని పేర్కొన్నారు. ఏపీ తరపు సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ వాదిస్తూ ఈ ప్రాజెక్టులు కొత్తవేనని, వీటికి సర్వే కూడా పూర్తికాలేదని వాదించారు. డీపీఆర్ లేకుండా ప్రాజెక్టుకు అనుమతులు కూడా లభించవని అన్నారు.

 అపెక్స్ కౌన్సిల్ సమావేశమవ్వాలి..
 ఈ నేపథ్యంలో జస్టిస్ కెహర్ జోక్యం చేసుకుంటూ అపెక్స్ కౌన్సిల్ ఏం చెబుతోందని, దాని విధులేంటని ప్రశ్నించారు. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, గోదావరి నదీ యాజమాన్య బోర్డు, అపెక్స్ కౌన్సిల్.. పునర్ వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఏర్పాటయ్యాయని రైతుల తరపు సీనియర్ న్యాయవాది వి.వి.గిరి తెలిపారు. ట్రిబ్యునల్ అవార్డుల ప్రకారం నీటిని వాడుకోవాలని, వివాదాలు తలెత్తినప్పుడు, ప్రాజెక్టుల నిర్మాణం జరపాలని నిర్ణయించినప్పుడు అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు.
 
 రాకెట్ వేగంతో పాలమూరు, డిండి
 సాక్షి,హైదరాబాద్: పాలమూరు, డిండి ప్రాజెక్టులకు పట్టిన శని విరగడైందని, రాకెట్ వేగంతో పాలమూరు, డిండి పనులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు చేసిన సూచనలను సీఎం స్వాగతించారు. సుప్రీంకోర్టు స్పందనతో పాలమూరు ప్రాజెక్టుకు శాశ్వతంగా అడ్డంకులు తొలగినట్లేనని వ్యాఖ్యానించారు. ఏపీ అభ్యంతరాలకు ఎక్కడా పెద్దగా విలువ లేనందున, పాలమూరు, డిండి ప్రాజెక్టులను శరవేగంగా నిర్మించాలని నీటిపారుదల శాఖను ఆదేశించారు. ఆగమేఘాల మీద పనులను పూర్తి చేసి ప్రాజెక్టు ఫలితాలను ప్రజలకు అందిస్తామని సీఎం స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement