కమెడియన్ ను అరెస్ట్ చేయాలని ఫిర్యాదు
ముంబై: అవినీతి ఆరోపణలు చేసిన కమెడియన్ కపిల్ శర్మ చిక్కుల్లో పడ్డారు. ఇంటి నిర్మాణంలో అక్రమాలకు పాల్పడిన కపిల్ శర్మను అరెస్ట్ చేయాలని సీనియర్ న్యాయవాది అభా సింగ్ డిమాండ్ చేశారు. అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వెర్సోవా పోలీస్ స్టేషన్ లో సింగ్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కపిల్ శర్మ మడ అడవుల(మాంగ్రూవ్స్)ను నాశనం చేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు.
బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్(బీఎంసీ) అధికారి ఒకరు తనను రూ. 5 లక్షలు లంచం అడిగారని కపిల్ శర్మ ట్వీట్ చేయడంతో వివాదం రేగింది. అవినీతి అధికారిపై ఏసీబీకి ఎందుకు ఫిర్యాదు చేయలేదని కపిల్ ను అభా సింగ్ ప్రశ్నించారు. కపిల్ శర్మ చేపట్టిన అక్రమ నిర్మాణాలను బీఎంసీ అధికారులు కూల్చివేయాలని డిమాండ్ చేశారు.
సెలబ్రిటీలకు పోలీసులు ఎప్పుడూ అనుకూలంగా వ్యవహరిస్తారని ఆరోపించారు. సల్మాన్ ఖాన్ కేసు పదేళ్లు నడవడమే ఇందుకు నిదర్శనమన్నారు. కపిల్ శర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుంటే కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. కపిల్ వ్యవహారంపై మహారాష్ట్ర నవనిర్మాణ సమితి (ఎంఎన్ఎస్) మండిపడగా, రానున్న బీఎంసీ ఎన్నికల్లో దీన్ని లేవనెత్తాలని కాంగ్రెస్ భావిస్తోంది.