
కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ (ఫైల్‌ఫోటో)
రాఫెల్ డీల్‌పై రాహుల్ అసత్యాలు..
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ నకిలీ రాఫెల్ వివాదాన్ని సృష్టిస్తున్నారని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం రెండు ప్రభుత్వాల మధ్య జరిగిందని, ఇందులో ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం లేనే లేదని స్పష్టం చేశారు. రాహుల్ ఆరోపణలు సత్యదూరమని తేటతెల్లమైందన్నారు. మోదీ సర్కార్‌పై పోరాడేందుకు ఎలాంటి అంశాలు లేని కాంగ్రెస్ దిక్కుతోచక లౌకికవాదానికి ప్రమాదం ఏర్పడిందని గగ్గోలు పెడుతోందని దుయ్యబట్టారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కీలక రాష్ట్రాలైన యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ మూడవ, నాలుగవ స్ధానంలో నిలవనుందని జైట్లీ జోస్యం చెప్పారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 225 స్ధానాల్లోనే నేరుగా బీజేపీతో తలపడేందుకు సిద్ధమైందన్నారు. మిగిలిన స్ధానాల్లో పోటీచేయకుండా మిత్రపక్షాలకు ఆయా స్ధానాలను కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఫేస్‌బుక్ పోస్ట్‌లో జైట్లీ పేర్కొన్నారు.
ఇక యుద్ధ విమానాల ఒప్పందానికి సంబంధించి గత ప్రభుత్వాలు సైతం ధరల వివరాలను బహిర్గతం చేయలేదని గుర్తుచేశారు. దేశ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఆయుధాల ధరలను వెల్లడించదన్నారు.