ఎంత మంది నేతలు జైలు కెళతారో చూడాలి | Arun jaitley says day of reckoning | Sakshi
Sakshi News home page

ఎంత మంది నేతలు జైలు కెళతారో చూడాలి

Published Wed, May 17 2017 2:37 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ఎంత మంది నేతలు జైలు కెళతారో చూడాలి - Sakshi

ఎంత మంది నేతలు జైలు కెళతారో చూడాలి

న్యూఢిల్లీ: కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించి సరిగ్గా బుధవారం నాటికి మూడేళ్లు నిండాయి. 2014, మే 16వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెల్సిందే. ఆ ఎన్నికల ప్రచారం సందర్భంగా దేశంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్ని పార్టీల రాజకీయ నాయకులను నరేంద్ర మోదీ ఎండగట్టారు. వాళ్లు కటకటాలు లెక్కించాల్సిన రోజు వస్తుందని కూడా హెచ్చరించారు. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా ఎన్నికకాగానే రాజకీయ నాయకులపై పెండింగ్‌లో ఉన్న కేసులను తిరగతోడుతారని రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ మొన్న మొన్నటి వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

మాజీ కేంద్ర హోం మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు పీ చిదంబరం కుమారుడైన కార్తి చిదంబరంపై సీబీఐ, ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌పై ఆదాయం పన్ను శాఖ అధికారులు మంగళవారం నాడు దాదాపు 50 చోట్ల దాడులు జరిపారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్‌ గాంధీ ఇప్పటికే ఇరుక్కొని ఉన్నారు. ఈ కేసులో వీరిద్దరు ఆదాయం పన్ను శాఖ విచారణను ఎదుర్కోవాల్సిందేనంటూ ఢిల్లీ హైకోర్టు ఇటీవలనే తీర్పు చెప్పిన విషయం తెల్సిందే. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని శారదా చిట్‌ఫండ్‌ స్కామ్‌ వెంటాడుతూనే ఉంది. ఢిల్లీలోని ఆప్‌ పార్టీకి చెందిన మూడో వంతు మంది ఎమ్మెల్యేలు ఏదో కేసులో విచారణను ఎదుర్కొంటూనే ఉన్నారు. తమిళనాడులో అఖిల భారత అన్నాడిఎంకే  నాయకులకు ఢిల్లీ బీజేపీ నేతల కాగ తగులుతూనే ఉంది.

ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులపై ఏకకాలంలో ఇన్ని కేసులు చుట్టుకోవడం ఇటీవలి దశాబ్దాల్లో బహూశ మొదటిసారి కావచ్చు. సరైనా సాక్ష్యాధారాలు లేకుండా కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని కూడా అనలేం. ఎందుకంటే చాలా కేసుల్లో నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. వారిపైనా దేశ న్యాయ వ్యవస్థ, దర్యాప్తు అధికారులు ఎప్పుడో చర్యలు తీసుకొని ఉండాల్సింది. అప్పటి ప్రభుత్వాల చల్లటి చూపు కారణంగా వారు తప్పించుకు తిరుగుతున్నారు. మూడేళ్లపాటు రాజకీయ ప్రత్యర్థులపై ఎలాంటి చర్యలకు ఉపక్రమించని దర్యాప్తు విభాగం, కోర్టులు నేడు నరేంద్ర మోదీ హయాంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి.

అయోధ్య కేసులో కుట్ర కేసు విచారణను ఎదుర్కోవాల్సిందేనంటూ సుప్రీం కోర్టు ఇటీవల బీజేపీ సీనియర్‌ నాయకుడు ఎల్‌కే అద్వానీకి వ్యతిరేకంగా తీర్పు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ప్రత్యర్థి రాజకీయ నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకున్నా మోదీ ప్రభుత్వాన్ని నేరుగా శంకించలేరు. ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిణామాలను చూస్తుంటే సరైన సమయంలో మోదీ మంత్రాంగం ఫలించి యంత్రాంగం పనిచేస్తుందని అనిపించక మానదు. కొన్ని సందర్భాల్లో ప్రత్యర్థులను కేసుల్లో ఇరికిస్తే అవి బూమరాంగ్‌ అయ్యే అవకాశాలు ఉంటాయి. కేసులను చూపించి ప్రజల సానుభూతి పొందేందుకు నిందితులు సహజంగా ప్రయత్నిస్తారు. సమీప భవిష్యత్తులో ప్రజలు తీర్పు చెప్పాల్సిన ఎన్నికలేవీ లేవు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్నుకోవాల్సిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలే ఉన్నాయి. పైగా ఈ అవినీతి కేసులను అస్త్రంగా వాడుకొని అధికార ప్రభుత్వం తమ అభ్యర్థినే గెలుపించుకునే అవకాశం కూడా ఉంటుంది.

అవినీతికి పాల్పడిన రాజకీయ నాయకులు ఊచలు లెక్కించాల్సి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ నాడన్న మాట, తమ అవినీతి చర్యలకు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ప్రత్యర్థి రాజకీయ నాయకులను ఉద్దేశించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ నేడన్న మాట నిజమయ్యే రోజు వస్తుందా ? పరస్పర ప్రయోజనాల కోసం రాజకీయ నేతలంతా లోలోన ఒక్కటైతే కేసులు అటకెక్కేస్తాయా ?

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement