నైనిటాల్ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ టీ, స్నాక్స్ కోసం భారీగానే ఖర్చు చేశారు. ఆయన మూడేళ్ల పదవీ కాలంలో టీ, స్నాక్స్ కోసం రూ.1.03 కోట్ల ఖర్చు చేసినట్టు ఆర్‌టీఐ డేటాలో వెల్లడైంది. హల్ద్వాని ఆధారిత ఆర్‌టీఐ కార్యకర్త హేమంత్ సింగ్ గౌనియా నమోదు చేసిన పిటిషన్‌లో ఈ విషయం తెలిసింది. ఫిబ్రవరిలో ఈ కార్యకర్త ఆర్‌టీఐ వద్ద తన పిటిషన్ దాఖలు చేశాడు. టీ, స్నాక్స్‌కు వెచ్చించిన ఖర్చులతో పాటు, ముఖ్యమంత్రి అయ్యాక కేజ్రీవాల్ చేసిన ప్రయాణాల కోసం రూ.11.99 లక్షలు ఖర్చు చేసినట్టు ఆర్‌టీఐ సమాధానంలో తెలిసింది.
2015-16లో ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం టీ, స్నాక్స్ కోసం రూ.23.12 లక్షలు ఖర్చు పెట్టగా.. 2016-17లో రూ.46.54 లక్షల వెచ్చించారని వెల్లడైంది. ఇక 2017-18లో ఈ మొత్తం రూ.33.36 లక్షలుగా నమోదైనట్టు ఆర్‌టీఐ తన సమాధానంలో పేర్కొంది. అంటే మొత్తంగా రూ.1.03 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. ఈ ఖర్చులపై స్పందించిన గౌనియా... ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం వీటిని తగ్గించుకోవాల్సినవసరం ఉందని, ఈ నగదును ఎవరైతే రోజులో ఒక్క పూట కూడా భోజనం చేయలేరో వారికి ఖర్చు చేయాలని సూచించారు. ప్రభుత్వం ఈ వ్యయాలను తగ్గిస్తుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై ఢిల్లీ సీఎం ఆఫీసు మాత్రం స్పందించలేదు.
ముఖ్యమంత్రి ఆఫీసు టీ, స్నాక్స్ కోసం వెచ్చించిన వ్యయాల్లో సెక్రటేరియట్‌కు, క్యాంప్ ఆఫీస్‌కు ఖర్చు చేసినవి రెండూ కలిసి ఉన్నాయి. 2015-16లో ఖర్చుచేసిన రూ.23.12 లక్షల్లో క్యాంప్ ఆఫీసు కోసం రూ.5.59 లక్షల ఖర్చు చేయగా.. సెక్రటేరియట్ ఆఫీసు కోసం రూ.17.53 లక్షలున్నాయి. 2016-17లో వెచ్చించిన రూ.46.54 లక్షల్లో సెక్రటేరియట్ ఆఫీసు కోసం రూ.15.91లక్షలు ఖర్చు చేయగా.. క్యాంప్ ఆఫీసుకు రూ.30.63 లక్షలు ఖర్చు చేశారు. 2017-18లోని రూ.33.36 లక్షల్లో సెక్రటేరియట్‌వి రూ.6.92 లక్షలు, క్యాంప్ ఆఫీసువి రూ.26.44 లక్షలున్నాయి. 2014లో కేజ్రీవాల్ సెంట్రల్ ఢిల్లీలోని భగవాన్ దాస్ రోడ్డులో ఉన్న ఐదు బెడ్‌రూమ్‌లు గల రెండు డూప్లెక్స్ ఫ్లాట్స్‌కు తరలి వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిలో ఒక డూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను ఫ్యామిలీ కోసం వినియోగిస్తుండగా.. రెండోది క్యాంప్ ఆఫీస్‌గా నడుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment