'కేసుకు భయపడేది లేదు.. పోరాటం సాగిస్తాం'
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. అరుణ్ జైట్లీ కోర్టు కేసుకు తాము భయపడబోమని, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. డీడీసీఏలో అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన విచారణ సంఘానికి సహకరించి జైట్లీ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని కేజ్రీవాల్ సూచించారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో పాటు పలువురు ఆప్ నేతలపై అరుణ్ జైట్లీ వ్యక్తిగత హోదాలో సోమవారం రూ.10 కోట్లకు ఢిల్లీ హైకోర్టులో పరువునష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ పైవిధంగా స్పందించారు. డీడీసీఏలో అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రమణ్యం నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఢిల్లీ రాష్ట్ర సర్కారు నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. డీడీసీఏ కుంభకోణం కేసులో జైట్లీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్, అరుణ్ జైట్లీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.