కేజ్రీపై జైట్లీ పరువునష్టం దావా!
ఢిల్లీ హైకోర్టులో నేడు దాఖలు
న్యూఢిల్లీ: ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)లో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆప్ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలతో కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ చట్టపరంగా స్పందించారు. కేజ్రీవాల్, ఆప్ నేతలు కుమార్ బిశ్వాస్, సంజయ్‌సింగ్, రాఘవ్ చద్దా, దీపక్ వాజ్‌పేయిలపై నేడు ఢిల్లీ హైకోర్టులో పరువునష్టం దావా వేయనున్నారు. పాటియాలా హౌస్ కోర్టులో క్రిమినల్ కేసు వేయనున్నారు. కాగా, డీడీసీఏలో అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు ఢిల్లీ రాష్ట్ర సర్కారు ఆదివారం ప్రకటించింది.
జైట్లీలాంటి వారికి భయపడమని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. డీడీసీఏలో అవకతవకలపై ఈడీ, డీఆర్‌ఐ దర్యాప్తు జరిపించాలని మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ డిమాండ్ చేశారు. అక్రమాలకు సంబంధించి 2011-12 నాటి ఏజీఎం వీడియో ఫుటేజ్‌ను ఆయన ఆదివారమిక్కడ విడుదల చేశారు. వీడియోలో అక్రమాలకు సంబంధించి ఆయన డీడీసీఏ అధికారులను నిలదీయడం.. అధ్యక్ష స్థానంలో కూర్చున్న జైట్లీ అధికారులను వెనకేసుకురావడం కనిపించింది. ఆప్ ఆరోపణల నేపథ్యంలో జైట్లీకి పలువురు భారత క్రికెటర్లు మద్దతుగా నిలిచారు. టాప్ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, ఇషాంత్ శర్మ పూర్తి మద్దతు ప్రకటించారు. గంభీర్ స్పందిస్తూ.. జైట్లీ డీడీసీఏ అధ్యక్షునిగా ఉన్న సమయంలో క్రికెట్‌కు మేలు జరిగిందని చెప్పారు.