'ఫేస్ బుక్, ట్విట్టర్ లో నాపై ఆరోపణలు'
న్యూఢిల్లీ : ఆప్ నేతలపై పరువునష్టం కేసులో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం పాటియాల హౌస్ కోర్టుకు హాజరయ్యారు. జైట్లీ స్టేట్మెంట్ను పాటియలా హౌస్ కోర్టు రికార్డు చేసింది. తనతో పాటు కుటుంబసభ్యులపై కేజ్రీవాల్తో పాటు ఆప్ నేతలు ...ట్విట్టర్, ఫేస్ బుక్ లో నిరాధార ఆరోపణలు చేశారని ఆయన తన స్టేట్మెంట్లో తెలిపారు. తన పరువుకు భంగం కలిగించారని జైట్లీ పేర్కొన్నారు. కాగా ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిధుల దుర్వినియోగం వ్యవహారంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేతలు...అరుణ్ జైట్లీపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోతనతో పాటు తనకుటుంబ సభ్యులపై అసత్య ఆరోపణలు చేసిన కేజ్రీవాల్తో పాటు అయిదుగురు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకులు కుమార్ విశ్వాస్, అశుతోష్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, దీపక్ వాజపేయిలపై జైట్లీ రూ.10 కోట్లకు వ్యక్తిగత హోదాలో డిసెంబర్ 21న పరువునష్టం దావా వేశారు. ఇందుకోసం ఆయన స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. ఇక డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిధుల దుర్వినియోగంపై అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీల మధ్య మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే.