
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ తనను ఉగ్రవాదిగా అభివర్ణించడంతో మానసిక వేదనకు గురయ్యానని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశ సేవ కోసమే తన జీవితాన్ని అంకితం చేశానని.. అందుకోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నానని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలకు ఒకవేళ తాను ఉగ్రవాదిలా కనిపిస్తే కమలానికి ఓటెయ్యాలని లేదంటే చీపురు గుర్తు ఉన్న బటన్ నొక్కాలని విఙ్ఞప్తి చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ కేజ్రీవాల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.(అందుకేనా మా నాన్న ఉగ్రవాది...?)
ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ బుధవారం మాట్లాడుతూ... ‘‘ఆయన మాటలకు నేను చాలా బాధపడ్డాను. మా కుటుంబం, పిల్లల కోసం నేనేమీ చేయలేదు. ఐఐటీలోని నా బ్యాచ్‌మేట్లలో 80 శాతం మంది విదేశాల్లో స్థిరపడ్డారు. నేను మాత్రం దేశ సేవకే అంకితమయ్యాను. ఇన్‌కం ట్యాక్స్ కమిషనర్ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాను. నేను ఉగ్రవాదినా కాదా అన్న విషయాన్ని ఢిల్లీ ప్రజలకే వదిలేస్తున్నా. ఒకవేళ నేను ఉగ్రవాదిని అనుకుంటే ఫిబ్రవరి 8న కమలం ఉన్న బటన్‌పై నొక్కండి. ఒకవేళ ఢిల్లీ ప్రజల కోసం, దేశం కోసం పనిచేశానని భావిస్తే చీపురుకట్ట గుర్తుపై నొక్కండి’’ అని విఙ్ఞప్తి చేశారు.(ఆ ఫొటోలు ఆనాటివి.. వాళ్లతో సంబంధం లేదు!)
Comments
Please login to add a commentAdd a comment