జైట్లీపై కేజ్రీ‘వార్’ | Arvind Kejriwal targets Arun Jaitley: CBI read DDCA file in my office | Sakshi
Sakshi News home page

జైట్లీపై కేజ్రీ‘వార్’

Published Fri, Dec 18 2015 12:41 AM | Last Updated on Sun, Sep 3 2017 2:09 PM

జైట్లీపై కేజ్రీ‘వార్’

జైట్లీపై కేజ్రీ‘వార్’

పరస్పర ఆరోపణలు విమర్శలతో ముదురుతున్న రగడ
జైట్లీ తప్పుకోవాలి.. లేదా తప్పించాలి: కేజ్రీవాల్ డిమాండ్

* జైట్లీ హయాంలో డీడీసీఏలో భారీ ఆర్థిక అవకతవకలు: ఆప్
* దృష్టి మరల్చేందుకు కేజ్రీవాల్ తప్పుడు ప్రచారం: జైట్లీ
* యూపీఏ హయాంలోనే జైట్లీకి ఎస్‌ఎఫ్‌ఐఓ క్లీన్‌చిట్: బీజేపీ

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంలో సీబీఐ సోదాల నేపథ్యంలో ఢిల్లీ సర్కారుకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య రాజుకున్న రగడ  ముదురుతోంది.

కేంద్రమంత్రి జైట్లీ ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడిగా ఉన్నపుడు భారీ ఆర్థిక అవకతవకలు జరిగాయని, అందుకు సంబంధించిన ఫైలు కోసమే సీబీఐ దాడులు జరిపిందని ఆరోపించిన కేజ్రీవాల్.. జైట్లీపై తన దాడిని ఉధృతం చేశారు. డీడీసీఏ అవినీతిపై నిష్పాక్షిక దర్యాప్తు జరగటానికి కేంద్ర మంత్రివర్గం నుంచి జైట్లీ తప్పుకోవాలని.. లేదంటే ప్రభుత్వమే ఆయనను తప్పించాలని డిమాండ్ చేశారు.

కేజ్రీవాల్ ఆరోపణలపై జైట్లీ ఎదురుదాడికి దిగారు. ఆయన అవినీతి అధికారిని రక్షిస్తున్నారని.. దృష్టి మరల్చేందుకు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ గళం పెంచగా, జైట్లీకి బీజేపీ వెన్నుదన్నుగా నిలిచింది.
 
దర్యాప్తు నుంచి ఎందుకు పారిపోతున్నారు?: కేజ్రీవాల్
జైట్లీని ఉచ్చులో బిగించే డీడీసీఏ ఫైలు కోసమే సీబీఐ తన కార్యాలయంపై దాడులు నిర్వహించిందని కేజ్రీవాల్ ఆరోపించిన విషయం తెలిసిందే. ‘‘తనపై ఆప్ చేసిన ఆరోపణలు నిరాధారమని, నిర్దిష్టమైనవి కావని జైట్లీ ఉద్ఘాటించటాన్ని పరమసత్యంగా పరిగణించరాదు.. ఆయనపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. భారీ మొత్తాలు ఉన్నాయి.

ఆయన దర్యాప్తు నుంచి ఎందుకు పారిపోతున్నారు? జైట్లీ ఏమీ లేదని నిరాకరిస్తున్నారన్న ప్రాతిపదికతో ఆయనపై దర్యాప్తు జరపకుండా వదిలిపెట్టేట్లయితే.. బొగ్గు, 2జీ కేసుల్లో నిందులను కూడా అలాగే వదిలిపెట్టాలా? స్వతంత్ర దర్యాప్తుకు వీలు కలిగించేందుకు ఆయన పదవికి రాజీనామా చేయాలి.. లేదా ఆయన్ను తొలగించాలి’’ అని కేజ్రీవాల్ గురువారం వరుస ట్వీట్లలో డిమాండ్ చేశారు.  
 
భారీ మొత్తాలు దారిమళ్లించారు: ఆప్
డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్న 13 ఏళ్ల కాలంలో ఆ సంఘంలో భారీ ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. భారీ స్థాయిలో నిధులను నకిలీ సంస్థల ద్వారా దారి మళ్లించారని.. క్రికెట్ టీమ్ ఎంపికలు సహా ఇతర అక్రమాలు కూడా జరిగాయని పేర్కొంది. ఆప్ అధికార ప్రతినిధి రాఘవ్‌చద్దా, పార్టీ ఇతర నేతలతో కలిసి గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ డీడీసీఏ అంతర్గత దర్యాప్తు సంఘమైన ఎస్‌ఎఫ్‌ఐఓ నివేదిక, ఢిల్లీ ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ నివేదికలను ఉటంకిస్తూ జైట్లీపై ఆరోపణలు గుప్పించారు.

‘‘ఢిల్లీ క్రికెట్ సంఘానికి జైట్లీ అధ్యక్షుడిగా ఉన్న హయాంలో ఆ సంఘంలో భారీ అవినీతికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సమ్మతి తెలిపారని ధ్వజమెత్తింది. ఈ కేసులో దర్యాప్తు చేసే అధికారం గల కొన్ని దర్యాప్తు సంస్థలు ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలో ఉన్నందున.. దర్యాప్తు నిష్పాక్షికంగా జరగటం కోసం జైట్లీ రాజీనామా చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరాలి’’ అని డిమాండ్ చేశారు.
 
జైట్లీది మచ్చలేని రాజకీయ చరిత్ర: బీజేపీ
జైట్లీది నిష్కళంకమైన రాజకీయ చరిత్ర అని, ఆయనపై ఆరోపణలు దురుద్దేశంతో కూడుకున్నవని బీజేపీ ఖండించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘అరుణ్‌జైట్లీది నిష్కళంకమైన రాజకీయ చరిత్ర. ఆయనపై ఆరోపణలు.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పనిచేస్తున్న ఒక అవినీతి అధికారిపై నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు రాజకీయ చిత్తచాంచల్యం వంటి దూషణాత్మకమైన అసంబద్ధ ప్రచారం.

యూపీఏ హయాంలో డీడీసీఏ వ్యవహారాలపై దర్యాప్తు జరిపిన ఎస్‌ఎఫ్‌ఐఓ జైట్లీకి క్లీన్‌చిట్ ఇచ్చింది. ఇప్పుడు ఆయన రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేయటం ఆ పార్టీ రాజకీయ కపటత్వాన్ని బహిర్గతం చేస్తోంది. జైట్లీపై ఆరోపణల ద్వారా ప్రజా దృష్టిని మరల్చాలన్న ఆప్ దురుద్దేశాన్ని బీజేపీ బహిరంగంగా ఖండిస్తోంది. జైట్లీకి మద్దతుగా పార్టీ దృఢంగా నిలుస్తోంది’’ అని పేర్కొన్నారు.  
 
జైట్లీపై ఆరోపణలు నిరాధారం: డీడీసీఏ
జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్నపుడు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆప్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని డీడీసీఏ ఖండించింది.  జైట్లీ క్రికెట్ క్రీడను మెరుగుపరచటం కోసం కృషిచేశారని, ఫిరోజ్‌షా కోట్లా స్టేడియాన్ని ప్రపంచ స్థాయికి పెంచారని.. ఆయనను ఈ వివాదంలోకి లాగటం అనుచితమని పేర్కొంది. ఈ సందర్భంగా.. స్టేడియం పునరుద్ధరణకు అయిన వ్యయానికి సంబంధించిన వివరాలను చదివి వినిపించారు.
 
దృష్టి మరల్చేందుకు తప్పుడు ప్రచారం: జైట్లీ
కేజ్రీవాల్ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ జైట్లీ ఎదురుదాడికి దిగారు. ఆయన గురువారం ఇంటర్నెట్ బ్లాగ్‌లో రాయటంతో పాటు, ఢిల్లీలో మీడియా సమావేశంలోనూ మాట్లాడారు. ‘‘ఈ ఆరోపణల్లో ఇసుమంతైనా వాస్తవం లేదు. అసత్యాలు చెప్పటం, అపనిందలు వేయటాన్ని ఆయన విశ్వసిస్తున్నట్లు.. అపస్మారక స్థితికి దగ్గరైన భాషను ప్రయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. డీడీసీఏ ఉదంతం.. స్వయంగా తానే బోనులో ఉన్నపుడు ప్రజల దృష్టిని మరల్చేందుకు చేసే ప్రచార ఎత్తుగడలో భాగం.

అవినీతి కేసులో దర్యాప్తు ఎదుర్కొంటున్న ఒక అధికారిని రక్షించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. నేను క్రికెట్ పర్యవేక్షణను 2013 లో వదిలిపెట్టాను. గతంలో ఢిల్లీ క్రికెట్ వ్యవహారాలపై వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తును సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐఓ)కు యూపీఏ సర్కారు అప్పగించింది. అది 2013 మార్చి 21న నివేదిక ఇచ్చింది. ఎటువంటి మోసం కనిపించలేదని స్పష్టంచేసింది. డీడీసీఏ అధ్యక్షుడిగా నా పాత్ర ఒక కంపెనీలో రోజు వారీ వ్యవహారాలకు సంబంధం లేని నాన్-ఎగ్జిక్యూటివ్ (నిర్వహణాధికారం లేని) చైర్మన్ పాత్ర వంటిది’’ అని పేర్కొన్నారు.  
 
ఆప్ ‘విరాళాల’పై సీబీఐ దర్యాప్తుకు ఢిల్లీ హైకోర్టు నో
ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో విరాళాల సేకరణలో విదేశీ మాదకద్రవ్య నియంత్రణ చట్టం నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలన్న వినతిని ఢిల్లీ హైకోర్టు గురువారం తోసిపుచ్చింది. దీనికి సంబంధించిన ఒక ఫిర్యాదును సీబీఐ ఇప్పటికే దర్యాప్తు చేసిందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement