సాక్షి, గువహటి : అసోం ప్రభుత్వం సంచలన పథకాన్ని ప్రవేశపెట్టింది. బాలికలను చదువుల దిశగా ప్రోత్సహించేందుకు వినూత్నంగా ఆలోచించింది. రాష్ట్రంలో పెళ్లి చేసుకోబోయే ప్రతి వధువుకు 10 గ్రాముల బంగారం కానుకగా అందించేందుకు కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ‘అరుంధతి బంగారు పథకం’ పేరుతో తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా బాల్యవివాహాల నిరోధం, మహిళా సాధికారత లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం సంవత్సరానికి 800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఈ పథకానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, ఇది 2020 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని అసోం ఆర్థిక మంత్రి హిమంత బిశ్వశర్మ బుధవారం వెల్లడించారు.
ఈ పథకానికి సంబంధించి కొన్ని విధివిధానాలు కూడా మంత్రి ప్రకటించారు. రూ. 30 వేల నగదును ప్రభుత్వం వధువు అకౌంట్‌లో డిపాజిట్ చేయనుంది ప్రభుత్వం. ఇకపై ప్రతి ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో..అప్పుడు ఉన్న బంగారం ఖరీదును బట్టి..పథకం ద్వారా ఇచ్చే నగదులో మార్పులు ఉంటాయి. ఇది మొదటి వివాహ సందర‍్భంగా మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ పథకం అమల్లోకి రానున్న ఈ పథకంలో ప్రాథమికంగా టీ గార్డెన్, ఆదివాసీ గిరిజనులకు కనీస విద్యార్హత నిబంధనను సడలిస్తున్నట్టు మంత్రి తెలిపారు. 1954 ప్రత్యేక వివాహ (అసోం) నిబంధనల ప్రకారం వివాహాలను అధికారికంగా నమోదు చేసిన తరువాత ఈ పథకం కింద ప్రయోజనం పొందవచ్చు.
అర్హతలు:
కనీస వివాహ వయస్సు వధువు (18), వరుడు (21) ఏళ్లు ఉండాలి..
వధువు కనీసం 10వ తరగతి వరకు చదువుకొని ఉండాలి.
వివాహాన్ని తప్పనిసరిగా నమోదు చేయించాలి.
వధువు సంరక్షకులు (తండ్రి, తల్లి) వార్షిక ఆదాయం రూ. 5 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment