దేవతల టాటూ వేసుకున్నాడని...
బెంగళూరు: టాటూల క్రేజ్ ఓ ఆస్ట్రేలియన్ జంట చిక్కుల్లో పడేసింది. హిందూ దేవతల బొమ్మలను శరీరం మీద టాటూలుగా వేయించుకోవడంతో స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. వీపుపై గణేష్ బొమ్మను , ఎల్లమ్మ దేవత బొమ్మను కాలిపై టాటూ వేయించుకొని తమ మనోభావాలను అవమానించారంటూ వారు దాడికి దిగారు. దీంతో ఉద్రికత్త పరిస్థితులు తలెత్తాయి. ఈ సంఘటన బెంగళూరులోని ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకుంది.
ఆస్ట్రేలియా పర్యాటకుడు మాట్ కీత్(21) అతని గర్ల్ ఫ్రెండ్ ఒక హోటల్ లో కూర్చుని ఉండగా అతని కాలిపై హిందూ దేవత టాటూలను గమనించిన కొంతమంది వ్యక్తులు ఆందోళనకు దిగారు. మూకుమ్మడిగా భౌతికి దాడికి దిగి విచక్షణా రహితంగా కొట్టారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దీంతో గందరగోళం చెలరేగింది.
ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు టాటూ తొలగించాల్సిందిగా ఆదేశించారు. కీత్ తో పాటు, బెంగళూరుకు చెందిన అతని స్నేహితురాలు ఇద్దరినీ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. టాటూను చెరిపేయాలంటూ ఆదేశించారు. అతని టాటూకు సంబంధించిన వీడియోను స్వాధీనం చేసుకున్నారు.
కాగా తనపై దాడిచేస్తున్న వారిని నివారించకుండా పోలీసులు అమానుషంగా వ్యవహరించారంటూ కీత్ వాపోయాడు. తనచేత బలంతంతా క్షమాపణ పత్రం రాయించుకున్నారని ఆరోపించాడు. తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఆ క్షమాపణ పత్రాన్ని కీట్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు.
ప్రతీక్షణం తనను, తన గర్ల్ ఫ్రెండ్ ను దాడులనుంచి రక్షించుకోవాలా అంటూ ప్రశ్నించాడు. శారీరక, మానసిక హింసను భరించాల్సిన అవసరం ఆమెకు లేదన్నాడు. అయినా తనకు భారతదేశం, హిందూమతం మీద గౌరవం ఉందికనుకే దాదాపు 35 గంటలు స్టేషన్ లోనే ఉన్నానన్నాడు. అందరికీ సమానత్వం ఉండాలి, తమకు న్యాయం జరగాలని అన్యాయానికి వ్యతిరేకంగా చేస్తున్న తమ పోరాటానికి మీ అందరి మద్దతు కావాలంటూ విజ్క్షప్తి చేశాడు. మాట్ కీత్(21) అతని గర్ల్ ఫ్రెండ్ ఎమిలీ కసియానో (20) బెంగళూరులోని ఓ రెస్టారెంట్‌లో ఉంటూ లా చదువుకుంటున్నట్టు సమాచారం.
అయితే ఈ సంఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. విచారణ అనంతరం దాడిచేసిన వారిపైన, విదేశీ జంటను వేధించిన పోలీసులపై తగిన చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీసు అధికారి సందీప్ పాటిల్ తెలిపారు.