తప్పు జరిగితే బాధ్యత వహిస్తా!
కాల్స్‌పై దర్యాప్తు చేసుకోవచ్చు.. వృత్తిపరంగానే భండారీని కలిశా: అశోక్ గజపతిరాజు
సాక్షి, న్యూఢిల్లీ: ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీతో తన ఓఎస్డీకి సంబంధాలున్నాయంటూ వార్తలొస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు స్పందించారు. ఓఎస్డీ అప్పారావు తప్పుచేసినట్లు తను భావించటం లేదన్నారు. అయినా ఈ విషయంలో నిజం తెలుసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని.. వారు తప్పుచేస్తే ఆ బాధ్యత కూడా తనదేనని గురువారం ఢిల్లీలో చెప్పారు. ‘మీ (మీడియా) ఆరోపణలను నేను సమీక్షిస్తాను. నా వ్యక్తిగత సిబ్బంది తప్పుచేస్తే.. అది నా వ్యక్తిగత బాధ్యతగా భావిస్తాను’ అని అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు.
400 ఫోన్ కాల్స్ రావటంపై విచారణ జరుపుతామని.. ఈ విషయంలో ఎవరినీ అపార్థం చేసుకోనన్నారు. అప్పారావుపై నమ్మకం ఉంది కాబట్టే ఓఎస్డీగా నియమించుకున్నానన్నా రు. తనను భండారీ కలిశారన్న ఆరోపణలపై స్పందిస్తూ.. ‘ఏరోస్పేస్ రంగం లో ఉన్నవారంతా కలుస్తూనే ఉంటారు. బెంగుళూరు ఎయిర్‌షోలో భండారీ ఆహ్వానం మేరకు అతడి స్టాల్‌ను సందర్శించా. ప్రత్యేక రాడార్ కనిపెట్టారని విని వెళ్లాను’ అని తెలిపారు.
భండారీపై నల్లధనం కేసు: భండారీపై నల్లధన చట్టం కింద కేసుపెట్టాలని ఐటీ శాఖ భావి స్తోంది. పన్ను ఎగవేత, విదేశాల్లో అక్రమ ఆస్తు ల అంశాలను ఈ కేసులో పేర్కొననున్నారు.