ఐదు నిమిషాల్లో బెయిల్ | Bail in Five minutes | Sakshi
Sakshi News home page

ఐదు నిమిషాల్లో బెయిల్

Published Sun, Dec 20 2015 1:54 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ఐదు నిమిషాల్లో బెయిల్ - Sakshi

ఐదు నిమిషాల్లో బెయిల్

హెరాల్డ్ కేసులో కోర్టుకు హాజరైన సోనియా, రాహుల్
 
♦ అగ్రనేతలకు అండగా పార్టీ నేతలంతా తరలివచ్చిన వైనం  
♦ నవ్వుతూ లోపలికి వెళ్లి.. బెయిల్‌తో నవ్వుతూ బయటకు
♦ విదేశీ ప్రయాణాలపై షరతులు విధించాలన్న సుబ్రమణ్యంస్వామి  
♦ అంగీకరించని మెజిస్ట్రేట్.. మళ్లీ ఫిబ్రవరి 20వ తేదీన విచారణ
 
 దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ.. మీడియాలో వాడివేడి చర్చ.. రాజధాని ఢిల్లీలో భారీ భద్రత.. సర్వత్రా కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన.. వీటన్నిటి మధ్య నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలు శనివారం ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు.  వెంటనే బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. చిరునవ్వుతో లోపలికి వెళ్లిన తల్లీకుమారులు.. పావు గంటలో అదే నవ్వుతో బయటకు వచ్చి కార్యకర్తలకు అభివాదం చేశారు. ఇందులో మెజిస్ట్రేట్ ఎదుట హాజరై, బెయిల్ తీసుకోవటానికి వారికి పట్టిన సమయం కేవలం ఐదు నిమిషాలే. ఆ తర్వాత నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకుని మీడియా సమావేశంలో మాట్లాడారు. తమపై తప్పుడు ఆరోపణలు మోపుతున్నారంటూ మోదీ సర్కారుపై మండిపడ్డారు. తాము తలవంచేది లేదని, పోరాటం కొనసాగిస్తామని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ అగ్రనేతలిరువురూ కోర్టుకు రాకముందు.. కోర్టు హాలులో.. ఆ తర్వాతా.. పార్టీ అగ్రస్థాయి నాయకులంతా వారి వెన్నంటే ఉన్నారు.
 
 ‘‘ ఈ దేశపు చట్టాలు ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయి. సత్యం వెలుగుచూస్తుందన్న దానిపై నాకెలాంటి సందేహం లేదు’’
 
 రూ.50 లక్షలకే.. రూ.2వేల కోట్లు ధారాదత్తం!
► నేషనల్ హెరాల్డ్‌ను ప్రచురించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు 2005లో కాంగ్రెస్ పార్టీ రూ.90.25 కోట్ల రుణం ఇచ్చింది.
► 2010లో ఏర్పడిన యంగ్ ఇండియా లిమిటెడ్ (వైఐఎల్-ఇందులో సోనియా, రాహుల్‌లకు చెరో 38 శాతం వాటా ఉంది)కు ఈ రూ.90.25 కోట్ల రుణాన్ని వసూలు చేసుకునే హక్కును కేవలం రూ.50లక్షలకే కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టింది.
► నష్టాల కారణంగా 2008లో ప్రచురణ నిలిచిపోయే సమయానికి నేషనల్ హెరాల్డ్ ఆస్తుల విలువ రూ.2వేల కోట్లు. కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చలేమని ఇందుకు కంపెనీకి చెందిన 9 కోట్ల పై చిలుకు షేర్లను వైఐఎల్‌కు ఇచ్చేందుకు ఏజేఎల్ సర్వసభ్యసమావేశం తీర్మానించింది. దీంతో రూ.50 లక్షలకే దాదాపు రూ. 2వేల కోట్ల విలువైన ఆస్తులు నలుగురైదుగురి నియంత్రణలోకి వెళ్లాయని స్వామి కేసు పెట్టారు.
 
 ‘‘కాంగ్రెస్ పార్టీ పేదల కోసం, అణగారిన వారి కోసం పోరాటం కొనసాగిస్తుంది.. మేం ఒక్క అంగుళం కూడా జరగం’’ అని రాహుల్ ఉద్ఘాటించారు.
 
 న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలతో పాటు ఇతర నిందితులైన మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్‌దూబేలు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో విచారణ కోర్టుకు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన న్యాయ నిపుణులు కపిల్‌సిబల్, అశ్వినీకుమార్ (ఇద్దరూ మాజీ కేంద్రమంత్రులు), అభిషేక్ మనుసింఘ్వీలతో పాటు.. గులాంనబీఆజాద్, మల్లిఖార్జునఖర్గే, ఎ.కె.ఆంటోని, షీలాదీక్షిత్, అంబికాసోని, మీరాకుమార్ వంటి ఇతర అగ్ర నేతలు కూడా వెంటవచ్చారు. పాటియాలా హౌస్ కోర్టు కాంప్లెక్స్‌లో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ లవ్లీన్ ఎదుట హాజరైన సోనియా, రాహుల్‌ల వెంట మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, సోనియా కుమార్తె ప్రియాంకగాంధీలూ ఉన్నారు.

కోర్టులోకి కేసుతో సంబంధం లేని వారెవరినీ అనుమతించలేదు. మూడు నిమిషాల పాటు సాగిన ప్రక్రియలో.. ఈ కేసులో తాము నిర్దోషులమని పేర్కొని బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా దానిని మెజిస్ట్రేట్ ఆమోదించారు. వీరు సమాజంలో లోతైన మూలాలు ఉన్న మనుషులని.. ఉన్నత స్థానాల్లో ఉన్నారని.. వారిపై గతంలో ఎటువంటి అభియోగాలూ లేవని సిబల్, సింఘ్వీలు కోర్టుకు చెప్పారు. నిందితుల విదేశీ ప్రయాణాలపై షరతులు విధించాలన్న సుబ్రమణ్యంస్వామి విజ్ఞప్తికి కోర్టు అంగీకరించలేదు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులు ఒక్కొక్కరు రూ. 50,000 వ్యక్తిగత బాండు, ఒక పూచీకత్తు సమర్పించాక బెయిల్ మంజూరు చేశారు.

ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న శ్యాంపిట్రోడా హాజరుకాలేదు. ఆయన అనారోగ్యంగా ఉన్నారని కోర్టుకు నివేదించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన తదుపరి విచారణ జరుగుతుందని ప్రకటించిన మెజిస్ట్రేట్.. ఆ విచారణ నాడు నిందితుల్లో ఎవరికీ వ్యక్తిగత మినహాయింపునిచ్చేది లేదని స్పష్టంచేశారు. ఆ విచారణకు.. తన ఫిర్యాదుకు మద్దతుగా ఉన్న పత్రాలన్నిటినీ తీసుకురావాలని సుబ్రమణ్యంస్వామికి సూచించారు. ఐదు నిమిషాల్లోనే విచారణ, బెయిల్ ప్రక్రియ పూర్తవగానే.. సోనియా, రాహుల్‌లు నవ్వుతూ కోర్టు భవనం నుంచి బయటకు వచ్చారు. కిక్కిరిసిన న్యాయవాదులు, పాత్రికేయులు, భద్రతాసిబ్బంది, పార్టీ కార్యకర్తల తోపులాట మధ్య నుంచి వారు తమ వాహనాల వద్దకు చేరుకున్నారు.

 అందుకే.. షరతులు విధించాలన్నా: స్వామి
 సోనియా, రాహుల్‌లు కోర్టుకు హాజరై బెయిల్ పొందిన తర్వాత కోర్టు హాలు వద్ద సుబ్రమణ్యంస్వామి విలేకరులతో మాట్లాడుతూ.. తాము బెయిల్ కోరబోమంటూ వారు చేసిన ప్రచారమంతా అవాస్తవమని నిరూపితమైందని వ్యాఖ్యానించారు. వారికి బెయిల్ ఇవ్వటాన్ని తాను వ్యతిరేకించలేదని.. అయితే సోనియా, రాహుల్‌ల విదేశీ ప్రయాణాలపై షరతులు విధించాలని కోరానని చెప్పారు. ‘‘వారికి దేశం నుంచి మాయమైపోయే అలవాటు ఉంది.. ఒక్కోసారి ఎటువంటి సమాచారం లేకుండా 57 రోజులు కనిపించకుండాపోతారు.. అందుకే ఈ విజ్ఞప్తి చేశా’’ అంటూ.. కొంత కాలం కిందట రాహుల్ సెలవుపై వెళ్లటాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఎద్దేవాచేశారు.

బీజేపీ సూచనల మేరకు తాను ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నానన్న కాంగ్రెస్ విమర్శలను తిరస్కరిస్తూ.. ‘‘సాక్ష్యాలను చూడండి.. ప్రతీకారాన్ని కాదు’’ అని పేర్కొన్నారు. హెరాల్డ్ కేసు వేసినందుకే తనకు తాజాగా జడ్ కేటగిరీ భద్రత ఇచ్చారంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను తప్పుపడుతూ.. ‘‘పి.వి.నరసింహారావు సారథ్యంలోని కాంగ్రెస్ సర్కారు హయాంలోనే జడ్ కేటగిరీ భద్రత ఉంది.. ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వం దానిని తగ్గించింది. మా (బీజేపీ) ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. అలా తగ్గించటం అన్యాయమంటూ జడ్ కేటగిరీని పునరుద్ధరించింది’’ అని స్వామి పేర్కొన్నారు. కాగా, ‘‘సుబ్రమణ్యంస్వామి బీజేపీలో లేనప్పుడే వ్యక్తిగత హోదాలో క్రిమినల్ ఫిర్యాదు చేశారు. ఆ అంశాన్ని బీజేపీకి కానీ, ఎన్‌డీఏ ప్రభుత్వానికి కానీ ముడిపెట్టరాదు’’ అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.
 
 మాపై మోదీ తప్పుడు ఆరోపణలు
 న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. ప్రతిపక్షాన్ని ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకునేందుకు ప్రభుత్వ సంస్థలను పూర్తిగా వినియోగించుకుంటున్నారని సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘మేం పోరాటం కొనసాగిస్తాం.. తలవంచం’’ అని ఉద్ఘాటించారు. హెరాల్డ్ కేసులో కోర్టుకు హాజరై బెయిల్ పొందిన తర్వాత నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకున్న వారిరువురూ మన్మోహన్‌సింగ్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  కేంద్రంలోని మోదీ సర్కారుపై తీవ్ర ఆరోపణలు ఎక్కుపెడుతూ ‘‘ప్రస్తుత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకుంటోంది.. అందుకు ప్రభుత్వ సంస్థలను పూర్తిగా వినియోగించుకుంటోంది. దానికి ఎవరూ భయపడబోరు.

మేం పోరాటం కొనసాగిస్తాం’’ అని ఉద్ఘాటించారు. రాహుల్‌గాంధీ ప్రధాని మోదీపై నేరుగా విమర్శలు సంధిస్తూ.. ‘‘మోదీ గారు తప్పుడు ఆరోపణలు మోపుతారు.. ప్రతిపక్షం తలవంచుతుందని భావిస్తారు.. నేను, కాంగ్రెస్ పార్టీ  లొంగిపోబోం’’ అని వ్యాఖ్యానించారు.  బీజేపీ నేత సుబ్రమణ్యంస్వామి వేసిన కేసును ప్రస్తావిస్తూ.. ‘‘ఈ కేసు వెనుక ఉన్న వారి ఉద్దేశాల గురించి నాకు పూర్తిగా తెలుసు. మమ్మల్ని లక్ష్యంగా చేసుకోవటానికి వీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. వారు సఫలం కాబోరు’’ అని సోనియా వ్యాఖ్యానించారు. సోనియా, రాహుల్‌లకు మద్దతుగా కాంగ్రెస్ సమైక్యంగా నిలుస్తోందని మన్మోహన్ పేర్కొన్నారు. ‘‘మేం పోరాడుతాం.. మేం దృఢచిత్తంతో పోరాడుతాం. ఎందుకంటే.. మేం కొన్ని విలువలకు, కొన్ని ఆదర్శాలకు కట్టుబడ్డాం.. ఆ మార్గం నుంచి కాంగ్రెస్ పార్టీని ఎవరూ తప్పించలేరు’’ అని ఆయన చెప్పారు.
 
 హెరాల్డ్ కేసు కాలక్రమమిదీ...
 2013 జనవరి: సోనియా, రాహుల్ సహా ఆరుగిరిపై ఢిల్లీ కోర్టులో కేసు వేసిన బీజేపీ నేత సుబ్రమణ్యంస్వామి
 2014 జూన్ 26: నిందితులు 2014 ఆగస్టు 7న కోర్టు విచారణకు హాజరు కావాలని మెజిస్ట్రేట్ కోర్టు సమన్లు
 2014 ఆగస్టు 6: మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలపై ఢిల్లీ హైకోర్టు స్టే
 2014 ఆగస్టు: హెరాల్డ్ లావాదేవీల్లో గాంధీల పాత్రపై ఈడీ ప్రాధమిక దర్యాప్తు ప్రారంభం
 2014 ఆగస్టు 18: ఆధారాలు లేవంటూ దర్యాప్తును మూసివేయాలని ఈడీ నిర్ణయించినట్లు వార్తలు
 2014, ఆగస్టు 19: ఈడీ  డెరైక్టర్ రాజన్ కటోచ్ తొలగింపు.
 2014 డిసెంబర్ 15: సోనియా, రాహుల్ తదితరుల పిటిషన్లపై తుది నిర్ణయం వరకూ.. మెజిస్ట్రేట్ సమన్లపై స్టే పొడిగింపు.
 2015 జనవరి 12: సోనియా, రాహుల్‌ల పిటిషన్ల విచారణ నుంచి వైదొలగిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి
 2015 డిసెంబర్ 7: సుబ్రమణ్యంస్వామి ఫిర్యాదును, సమన్లను కొట్టివేయాలంటూ సోనియా, రాహుల్‌ల విజ్ఞప్తులను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు.. మెజిస్ట్రేట్ ఆదేశాలపై ఇచ్చిన స్టే తొలగింపు.. విచారణ కోర్టుకు హాజరుకావాలని నిర్దేశం.
 2015 డిసెంబర్ 8: సోనియా, రాహుల్ తదితరులు డిసెంబర్ 19వ తేదీన కోర్టు ఎదుట హాజరు కావాలని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు నిర్దేశం.
 2015 డిసెంబర్ 19: మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరై, బెయిల్ పొందిన సోనియా, రాహుల్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement