
వారికోసం సల్లూభాయ్!
ముంబై: బాలీవుడ్ కండల వీరుడు, హీరో సల్మాన్ ఖాన్ రైతులను ఆదుకునేందుకు పెద్ద మనసు చేసుకున్నారట. రికార్డు వసూళ్లతో కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న బజరంగీ భాయిజాన్ సినిమా లాభాల్లో కొంత భాగాన్ని ఆయన అన్నదాతలకు పంచనున్నారట. రీల్ లైఫ్లో పాప కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన హీరో ఇపుడు రియల్ లైఫ్ లో రైతన్నను ఆదుకోవడానికి ముందుకొచ్చినట్టు తెలుస్తోంది.
బీజేపీ నాయకురాలు షైనా ఈ విషయాలను వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్న అన్నదాతలను ఆదుకునేందుకు సల్మాన్ఖాన్, నిర్మాత రాక్లైన్ వెంకటేష్ ముందుకు వచ్చారని ఆమె తెలిపారు. అపార నష్టాలతో మనస్తాపానికై గురై రైతులు ఆత్మహత్యలకు చేసుకుంటున్న నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు సినీ పరిశ్రమ చొరవ చూపడం మంచి పరిణామమని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంట నష్టపోతున్న రైతులకు ఆపన్నహస్తం ఇవ్వనున్నట్లు చెప్పారు. తమ లాభాల్లో కొంత భాగాన్ని రైతుల సంక్షేమం కోసం విరాళంగా ఇవ్వడానికి అంగీకరించారని తెలిపారు. దీంతో రైతులకు పెద్ద ఊరట లభించే అవకాశం ఉందన్నారు. అయితే ఈ విషయాన్ని సల్లుభాయ్ ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.
కాగా విడుదలైన అయిదు రోజుల్లోనే బజరంగి భాయిజాన్ సుమారు రూ. 150 కోట్లకు పైగా బిజినెస్ సాధించింది. జూలై 17న ప్రేక్షకుల ముందుకొచ్చి ఇంకా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. రాక్లైన్ వెంకటేష్ నిర్మాణ సారధ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో కరీనా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. మరోవైపు దేశవ్యాప్తంగా తన హవాను కొనసాగిస్తున్న ఈ చిత్రం వారాంతానికి రూ.200 కోట్ల వసూళ్లను దాటొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.