దత్తన్నకు హిమాచలం | Bandaru Dattatreya Appointed As Himachal Pradesh Governor | Sakshi
Sakshi News home page

దత్తన్నకు హిమాచలం

Published Mon, Sep 2 2019 1:51 AM | Last Updated on Mon, Sep 2 2019 1:51 AM

Bandaru Dattatreya Appointed As Himachal Pradesh Governor - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలకు జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు, గౌరవం లభిస్తోంది. తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిన పార్టీ జాతీయ నాయకత్వం ఇక్కడి నాయకులను వెన్నంటి ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే సికింద్రాబాద్‌ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన కిషన్‌రెడ్డికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవిని ఇచ్చిన కేంద్రం.. సీనియర్‌ నాయకుడు బండారు దత్తాత్రేయను హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా నియమించడంతో రాష్ట్ర పార్టీ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో పార్టీని మరింత విస్తృతం చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టిన పార్టీ అధిష్టానం.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. రాష్ట్ర నేతలకు తగిన గౌరవం ఇచ్చి ప్రోత్సహిస్తోందని పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత పేర్కొన్నారు.

దత్తాత్రేయను హిమాచల్‌ గవర్నర్‌గా నియమించడంతో పార్టీ కార్యాలయంలో స్వీట్లు పంపిణీ చేశారు. ఆయన నివాసంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, టీఆర్‌ ఎస్‌ నేత కె.కేశవరావు, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం తదితరులు దత్తాత్రేయను కలసి అభినందనలను తెలియజేశారు. 2014 ఎన్నికల్లో సికింద్రాబాద్‌ ఎంపీగా బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచిన దత్తాత్రేయ.. కేంద్ర కార్మి కశాఖ మంత్రిగా బాధ్యత లు నిర్వహించారు. అయి తే 2019 సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్‌ పార్ల మెంట్‌ స్థానం నుంచి కిషన్‌రెడ్డి పోటీ చేసేందుకు అవకాశమిచ్చారు. పార్టీలో సీనియర్‌ నేత కావడం, చురుకుగా పనిచేస్తుండడంతో అధిష్టానం ఆయనకు గవర్నర్‌ పదవి ఇచ్చి గౌరవించింది. మరోవైపు మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీహెచ్‌ విద్యాసాగర్‌రావు పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో భగత్‌సింగ్‌ కోశ్యారీని గవర్నర్‌గా నియమించింది. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారన్న చర్చ పార్టీలో ఊపందుకుంది.  

అలయ్‌ బలయ్‌ కొనసాగిస్తా: దత్తన్న
బీజేపీలో అందరికీ అవకాశాలుంటాయని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో ఎన్టీఆర్‌ కళామందిరంలో జరిగిన గురుపూజోత్సవం సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీలో పార్టీకోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి ఏదో ఓ రకంగా అవకాశం, బాధ్యత లభిస్తుందన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా కేంద్రం తనను నియమించడం పట్ల దత్తాత్రేయ హర్షం వ్యక్తంచేశారు. తాను ఎక్కడున్నా భాషా సంస్కృతి, సంప్రదాయాలు, దేశ ఔన్నత్యా న్ని విస్మరించబోనన్నారు. రాజ్యాంగబద్ధమైన హోదాలో అక్కడి ప్రజలకు న్యాయం చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని పేర్కొన్నారు. తానెక్కడ ఉన్నా హైదరాబాద్‌ సంస్కృతిలో భాగమైన ‘అలయ్‌ బలయ్‌’కార్యక్రమాన్ని కొనసాగిస్తానన్నారు. చదువు చెప్పిన వారినే కాకుండా జీవితానికి మార్గదర్శనం చేసిన వారుకూడా గురువులేనన్నారు. గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయులను సత్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ సముద్రాల వేణుగోపాలాచారి, దేవీ ఉపాసకులు దైవజ్ఞశర్మ, టీటీడీ మాజీ సభ్యుడు రుద్రరాజు పద్మరాజు తదితరులు పాల్గొన్నారు. 

దత్తాత్రేయకు సముచిత గౌరవం: లక్ష్మణ్‌
పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన దత్తాత్రేయకు కేంద్ర ప్రభుత్వం సముచిత స్థానం కల్పించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ పేర్కొన్నారు. గవర్నర్‌గా దత్తన్న నియామకాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. 

దత్తన్న కృషి మరువలేనిది: కిషన్‌రెడ్డి 
హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులైన బండారు దత్తాత్రేయకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధిలో ఆయన కృషి మరువలేనిదని పేర్కొన్నారు. ఓ ప్రజామనిషిలా, ఏ పదవిలో ఉన్నా ఆ పదవితో సంబంధం లేకుండా ఆయన ప్రజలతోనే ఉన్నారని పేర్కొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement