ఆగ్రా: యమునా ఎక్స్ప్రెస్వేపై శనివారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్వల్పంగా గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. స్మృతి సాయం చేసి ఉంటే మా నాన్న బతికి ఉండేవారంటూ మృతిచెందిన వ్యక్తి కుమార్తె చెబుతున్నారు. క్షతగాత్రులకు సాయం అందిందంటూ స్మృతి ఆ రోజే ట్వీట్ చేసిన క్రమంలో తాజాగా బాధితుల వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
ప్రమాదంలో మరణించిన డాక్టర్ రమేష్ నాగర్ కుమార్తె శాందిలి మాట్లాడుతూ.. 'మంత్రి కారు తమ బైక్ ను ఢీకొట్టినప్పుడు మేము కింద పడిపోయాము. స్మృతి స్వల్పంగా దెబ్బ తిన్న తన కారు నుంచి దిగి మరో కారులో ఎక్కుతుండగా మేము ఆమెను సాయం చేయమని అడిగాము. కానీ ఆమె పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. మీకు తర్వాత సాయం చేస్తారంటూ అక్కడున్న సిబ్బంది చెప్పారు. ఆమె నిజంగా మాకు సాయం చేయాలని అనుకుని ఉంటే చేసి ఉండేది, ఇప్పుడు మా నాన్న మాతోనే ఉండేవారు' అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యింది.
ఆమె సోదరుడు అభిషేక్ మాట్లాడుతూ... నా చెల్లెలు చేతులు జోడించి సాయం కోసం అర్థించినా మంత్రి పట్టించుకోలేదన్నారు. కాగా ప్రమాదానికి గురైన కారు మంత్రి కాన్వాయ్ లోనిది కాదంటూ స్మృతి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. వ్రిందావన్లో తమ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి కారులో ఢిల్లీ వస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.
'సాయం కోసం వేడుకున్నా వెళ్లిపోయింది'
Published Mon, Mar 7 2016 3:23 PM | Last Updated on Sun, Sep 3 2017 7:12 PM
Advertisement
Advertisement