
సాక్షి, ముంబై: ముంబై నుంచి బెంగళూర్ వెళ్లే ఇండిగో విమానంలో మహిళా సిబ్బందిని లైంగికంగా వేధించిన ప్రయాణీకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని బెంగళూర్‌కు చెందిన రాజు గంగప్ప(28)గా గుర్తించారు. ముంబై విమానాశ్రయం నుంచి ఇండిగో విమానం బెంగళూర్‌కు బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో గంగప్ప విమాన మహిళా అటెండెంట్ (20)ను అసభ్యంగా తాకాడు. నిందితుడిని బాధితురాలు మందలించగా, ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించాడని అధికారులు పేర్కొన్నారు.
ఘటనకు సంబంధించి ఆమె తన సీనియర్లకు వివరించగా, బ్యాగేజ్ సహా నిందితుడిని ఫ్లైట్ నుంచి దించివేసినట్టు అధికారులు తెలిపారు. నిందితుడిని సీఐఎస్‌ఎఫ్ అధికారులకు అప్పగించగా, అనంతరం ఎయిర్‌పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఈ ఘటన జరగ్గా పోలీసులు అతడిని బుధవారం ముంబై కోర్టులో హాజరు పరిచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.