
‘టోల్’ రద్దయితే ‘బెస్ట్’..
- ఆర్థిక సమస్యలనుంచి బయటపడే అవకాశం
ముంబై సెంట్రల్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో టోల్ వసూలు రద్దయితే నగరంలో బస్సు సేవలందించే బృహన్‌ముంబై ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్టు) సంస్థకు కోట్ల రూపాయలు ఆదా అవుతాయి. ప్రతి ఏడాది టోల్ రూపంలో ‘బెస్ట్’ కోట్లాది రూపాయలు చెల్లిస్తోంది. ప్రభుత్వం టోల్ వసూలును నిలిపివేస్తే ప్రస్తుత ఆర్థిక సమస్యలనుంచి బయటపడవచ్చని సంస్థ భావిస్తోంది. 2013 ఏప్రిల్ నుంచి 2014 జనవరి వరకు బెస్టు రూ.41.6 కోట్ల టోల్ చెల్లించింది. టోల్ రద్దు చేసే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని రవాణా విభాగం అధికారులు తెలిపారు.
ముంబైలోని ప్రయాణికులతో పాటు ఠాణే, వాషి, మీరా-భయీందర్ పట్టణాలకు చెందిన ప్రజలు కూడా బెస్టు సేవలు పొందుతున్నారు. ముంబై దాటి వేరే ప్రాంతానికి వెళ్లాలంటే బెస్ట్ బస్సులు టోల్ నాకాలను దాటాల్సి ఉంటుంది. ఇతర ప్రాంతాల్లోకి ప్రవేశించడానికి బస్సుకు టోల్ తప్పనిసరిగా కట్టాలి. దీని వల్ల బెస్టుకు వస్తున్న ఆదాయం నుంచి కోట్ల రూపాయలు తగ్గుతోంది. ఆర్థిక సమస్యల్లో ఉన్న బెస్టుకు ముంబై కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ నిధులు అందితే నష్టాల నుంచి బయటపడేందుకు వీలుంటుంది.
కాగా కార్పొరేషన్ రూ.100 కోట్ల నిధులు అందజేసింది. కానీ బెస్ట్ ఎదుర్కొంటున్న సమస్యకు ఈ నిధులు సరిపోవని అధికారులు తెలిపారు. ఒకవేళ టోల్ వసూలు రద్దు చేసినట్లయితే ఎంతో సహాయమవుతుందని భావిస్తున్నారు. ఈ విషయంపై చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులకు టోల్ రద్దు చేసినట్లు బెస్టుకు కూడా ఆ సౌకర్యం కల్పించగలదని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.