
భగవద్గీతకు 5,151 ఏళ్లు!
న్యూఢిల్లీ: భారతదేశం ప్రపంచానికి అందించిన మహోన్నతమైన గ్రంథం భగవద్గీత రూపొంది 5,151 ఏళ్లయింది. ఈ సందర్భంగా ఆదివారం ఇక్కడ ఎర్రకోటలో నిర్వహించిన బహిరంగ సభలో విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ భగవద్గీతను జాతీయ పవిత్రగ్రంథంగా ప్రకటించాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఇతర ప్రపంచ నేతలకు గీతను కానుకగా ఇవ్వడంతో దానికి ఇప్పటికే జాతీయ పవిత్రగ్రంథం హోదా దక్కిందని ఆమె పేర్కొన్నారు. ఇక చేయాల్సిందల్లా ఆ హోదాను అధికారికంగా ప్రకటించడమేనని ఆమె అన్నారు. దైనందిన జీవితంతో గీతకు ఎంతో ప్రాధాన్యముందని చెప్పారు. నిష్కామ కర్మను బోధించే ఆ గ్రంథం మంత్రిగా తన విధినిర్వహణకు మార్గనిర్దేశం చేస్తోందన్నారు.
హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ మాట్లాడుతూ భగవద్గీత పోస్టల్ స్టాంపు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో విశ్వహిందూపరిషత్ నేత అశోక్‌సింఘాల్, మైనారిటీ మోర్చా చీఫ్ యూసఫ్ రనపూర్ణ్‌వాలా, బాబా రామ్‌దేవ్‌లతోపాటు 20 దేశాలకు చెందిన మతగురువులు, ప్రముఖులు పాల్గొన్నారు.
**