
‘సమస్యను పరిష్కరించాకే విభజన నిర్ణయం జరగాలి’
ఢిల్లీ: ఇప్పటికే పలుప్రాంతాల్లో తాగు, సాగు నీరుకు సంబంధించి సమస్యలున్నాయని వాటిని పరిష్కరించాకే విభజన నిర్ణయం జరగాలని కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన జరిగితే రాయలసీమ ప్రజలు ఎక్కువ నష్ట పోతారని పేర్కొన్నారు. ఆ ప్రాంతాల్లో తాగు, సాగు నీరుపై అనేక సమస్యలున్నాయని వాటిని పరిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రయత్నించాలన్నారు.
సమైక్యాంధ్రకే తన మొదటి ప్రాధాన్యత అని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గతంలోనే వెల్లడించారు. రాయలసీమ జిల్లాలను విభజిస్తే ఎట్టి పరిస్థితుల్లోను ఒప్పుకోమని ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్సకు స్పష్టం చేసిన సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఒంగోలు, నెల్లూరు జిల్లాలతో ప్రత్యేక రాయలసీమా ఏర్పాటు చేయాలని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు.