చేతులు నరికేస్తా జాగ్రత్త.. ఓ సీఎం హెచ్చరిక
బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రాం మాంఝీకి ఎక్కడలేని కోపం వచ్చింది. ఆయనకు కోపం రాకపోతే విశేషం. ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ పతాకశీర్షికలకు ఎక్కుతూనే ఉంటారు. ఈసారి.. వైద్యులు ఆయన ఆగ్రహానికి గురయ్యారు. పేద ప్రజల ప్రాణాలతో ఎవరైనా చెలగాటం ఆడుకున్నారో.. వాళ్ల చేతులు నరికేస్తానని సీఎం మాంఝీ హెచ్చరించారు. మోతీహారీలో ఓ సమావేశానికి హాజరై అక్కడ మాట్లాడుతుండగా ఆయనీ హెచ్చరిక చేశారు. పాట్నా వైద్యకళాశాల ఆస్పత్రికి ఇటీవల ఆయన వెళ్లినప్పుడు అక్కడ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి.
పాట్నాలో రావణ దహనం సందర్భంగా భారీ తొక్కిసలాట జరిగి, అక్కడి క్షతగాత్రులు ఆస్పత్రికి వస్తే.. అక్కడ వైద్యులు లేరు, మందులు లేవు, పరిస్థితి అంతా అస్తవ్యస్తంగా ఉంది. దాంతో సీఎం గారికి వైద్యుల మీద ఎక్కడలేని కోపం వచ్చి, సూపరింటెండెంట్ను పిలిస్తే.. ఆయన కూడా లేరు. ఆ విషయాలన్నింటినీ గుర్తుచేసుకున్నారో ఏమో గానీ.. ఇప్పుడు ఇలా చేతులు నరికేస్తానంటూ వ్యాఖ్యానించారు. నితీష్ కుమార్ తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన జీతన్ రాం మాంఝీ కారణంగా జేడీయూ తరచు తలపట్టుకోవాల్సి వస్తోంది. తాగడం తప్పుకాదని ఇంతకుముందు ఓసారి ఆయన అన్నారు.