ఇతరులతో అఫైర్లు తప్పు కాదు: మాంఝీ
బీహార్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం సమసిపోక ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. సమాజంలో మగాళ్లు వివాహేతర సంబంధాలు కొనసాగించడం సర్వ సాధారణమంటూ కొత్త వివాదానికి తెరతీశారు. భార్యలతో ఔటింగ్‌కు వెళ్లే మగవాళ్ల సంఖ్య 2-5 శాతానికి మించదని, 95 శాతం మంది మగవాళ్లు ఇతరుల భార్యలతో ఔటింగ్‌కు వెళ్లేందుకు ఇష్టపడతారని ఓ ఆంగ్ల పత్రిక గ్రూపుతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ‘గర్ల్ ఫ్రెండ్ ఉండడం తప్పుకాదు. మనం పాట్నాలోని ఎకో పార్కుకు వెళ్తే కనిపించే జంటలంతా పెళ్లికాని వారే కాదు. స్త్రీ, పురుషులు పెద్ద వాళ్లయితే వారి మధ్యనుండే సంబంధం పరస్పర సమ్మతితో కొనసాగేదే. ఇతరులతో అఫైర్లు ఉండడం తప్పేమీ కాదు. అది వారి వారి వ్యక్తిగత అంశం మాత్రమే’ అన్నారు. 2014 ఆగస్టులో.. పెళ్లయిన ఓ పోలీసు మహిళతో వ్యవహారం నడుపుతూ పట్టుబడిన తన కుమారుడి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సీనియర్ బీజేపీ నాయకులను కలుసుకునేందుకు ఢిల్లీ వచ్చిన సందర్భంగా మాంఝీ మీడియాతో మాట్లాడారు. బీహార్ ముఖ్యమంత్రిగా బలనిరూపణకు సిద్ధమైన నేపథ్యంలో ఆయన బీజేపీ నేతలను కలుసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయన మొదటి సారి అధికారికంగా అంగీకరించారు. ఈ నెల 20వ తేదీన ఆయన రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సి ఉంది. జేడీయూ నాయకుడు నితీష్ కుమార్ ఇటీవల ఢిల్లీకి తీసుకొచ్చిన 130 మంది ఎమ్మెల్యేల గురించి ప్రస్తావిస్తూ వారంగా ఎమ్మెల్యేలు కాదని, వారిలో 30 మంది వివిధ రాష్ట బోర్డులు, కమిషన్లకు చెందిన చైర్మన్లు ఉన్నారని ఆరోపించారు. జేడీ యూకు చెందిన 67 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికీ తనతోనే ఉన్నారని చెప్పారు.