మాంఝీకి మద్దతు మహాపాపం
బీజేపీపై శివసేన మరోసారి ఎత్తిపొడుపు మాటలతో దాడికి దిగింది. బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీకి మద్దతిచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, అది మహాపాపమని తీవ్రంగా వ్యాఖ్యానించింది. అదే జరిగితే రాజకీయాల్లో చీకటి శకానికి తీర్మానం చేసినట్లవుతుందని పేర్కొంది. సోమవారం ఆ పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో ఈ విషయం ప్రస్తావన చేసింది.
"కమీషన్ తీసుకుంటానని బహిరంగంగా ప్రకటించిన వాళ్ల రాజకీయ ప్రయోజనాలకోసం ఇలాంటి పాపానికి పాల్పడవద్దు. మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అయినా బీజేపీ మద్దతు పొందేందుకు మాంఝీ ప్రయత్నిస్తున్నారు. నితీష్ కుమార్కు వ్యతిరేకంగా మాంఝీ వ్యవహరించడాన్ని బీజేపీ సాధరణ అంశంగానే చూస్తోంది'' అని అందులో ప్రస్తావించింది. ప్రభుత్వానికి సంబంధించిన టెండర్ల విషయంలో దళితులకు, మహాదళితులకు రిజర్వేషన్లు కల్పించి మాంఝీ తన పరిమితులు దాటారని పేర్కొంది.