కన్ఫామ్: బీజేపీ కార్యకర్త తీసుకెళ్లింది బీఫ్
నాగ్‌పూర్: గోవు మాంసం (బీఫ్) తీసుకెళ్తున్నాడన్న అనుమానంతో మహారాష్ట్రలో బీజేపీ కార్యకర్తను స్థానికులు చితకబాదిన కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్త సలీమ్ షాహ(34) తన వెంట తీసుకెళ్తున్నది బీఫ్ అని ఫోరెన్సిక్ పరీక్షలలో శనివారం తేలింది. ఈ విషయాన్ని నాగ్‌పూర్ రూరల్ ఎస్పీ శైలేష్ బాల్క్‌వాడే వెల్లడించారు. గత బుధవారం నాగ్‌పూర్‌లోని భార్‌సింగీలో బైక్‌పై వెళ్తుండగా ఆరుగురు వ్యక్తులు అడ్డగించి బీఫ్ ఎందుకు తీసుకెళ్తున్నావ్ అంటూ కొందరు చితకబాదారు. బీఫ్ కాదని ఎంత మొత్తుకున్నా వినకుండా ఆ వ్యక్తులు బీజేపీ కార్యకర్తపై దాడికి పాల్పడ్డారు.
సలీమ్ ఫిర్యాదు మేరకు అతడిపై దాడికి పాల్పడిన నలుగురిని పోలీసులు ఇదివరకు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడి వద్ద ఉన్న మాంసాన్ని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించి టెస్ట్ చేయగా బీఫ్ అని తేలింది. చట్ట ప్రకారం గోమాంసంపై నిషేధం ఉన్నందున, ప్రస్తుతం చికిత్స పొందుతున్న బీజేపీ కార్యకర్త సలీమ్‌పై చర్యలు తీసుకుంటామని ఎస్పీ శైలేష్ తెలిపారు.
ఈ వివాదంపై నాగ్‌పూర్ రూరల్ బీజేపీ యూనిట్ అధ్యక్షుడు రాజీవ్ పొట్డార్ స్పందించారు. మా పార్టీ కార్యకర్త సలీమ్ బీఫ్ ను రవాణా చేస్తున్నాడని తెలిసి షాక్‌కు గురైనట్లు తెలిపారు. చట్ట ప్రకారం అతడిపై చర్యలు తీసుకుంటారు. పార్టీ నుంచి బహిష్కరణ వేటు పడే అవకాశం ఉందన్నారు. అయితే బీఫ్ కలిగిఉన్న వారిపై ఫిర్యాదు చేస్తే చాలని, ప్రజలు అనవసరంగా దాడులకు పాల్పడి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే కేసుల్లో ఇరుక్కుంటారని పేర్కొన్నారు.