
రక్తపు మడుగులో కమలాకర్ కుటుంబం
నాగ్‌పూర్ : గాఢనిద్రలో ఉన్న ఓ కుటుంబాన్ని గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణా రహితంగా వేటకొడవళ్లతో నరికి చంపిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన సోమవారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాగ్‌పూర్ ఆరాదన నగర్‌కు చెందిన కమలాకర్ పవన్‌కర్(45) భార్య అర్చన(40), కూతురు వేధాంతి(12), అల్లుడు గణేష్ పలట్‌కర్(4), నానమ్మ మీరాబాయ్(70)లు నిద్రలో ఉండగానే దారుణ హత్యకు గురయ్యారు.
కమలాకర్ వృత్తిరీత్యా రియల్ ఎస్టేట్ డీలర్. బీజేపీ కార్యకర్తగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. కాగా 10 ఎకరాల స్థలానికి సంబంధించిన విషయంలో కొంతకాలంగా కమలాకర్‌కు కొందరితో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబం మొత్తం హత్యకు గురికావటం పలు అనుమానాలకు తావిస్తోంది. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టానికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కమలాకర్ ఇంటి ముందు గుమిగూడిన జనం