సాక్షి నాలెడ్జ్ సెంటర్ : వచ్చే నెలలో గుజరాత్‌లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు విషయంలో బీజేపీ, కాంగ్రెస్... ఇరు పార్టీలు కులాల సమతుల్యం పాటిస్తున్నాయి. ఫలితాన్ని నిర్ణయించే పటేళ్లు, ఓబీసీలకు ప్రాతినిధ్యం విషయంలో ఇరు పక్షాలూ జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నాయి. మొత్తం 182 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఇప్పటికే బీజేపీ 134 స్థానాలకు, కాంగ్రెస్ 77 స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించాయి.
ఓబీసీల్లో చేర్చాలనే డిమాండ్‌తో ఉద్యమించిన పాటీదార్లకు(పటేళ్లు) రెండు ప్రధాన పక్షాలూ తగినన్ని టికెట్లు కేటాయించాయి. తొలి విడతలో బీజేపీ 70 సీట్లకు తమ అభ్యర్థులను ప్రకటించగా, వాటిలో 17 టికెట్లను పాటీదార్లకు ఇచ్చింది. మరో 18 సీట్లను బీసీలకు, వారిలోనూ అధికంగా ఠాకూర్లు, కోలీలకు బీజేపీ కేటాయించింది. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లో బీజేపీ కోలీ వర్గానికి ఎక్కువ టికెట్లు ఇచ్చింది. ఇక కాంగ్రెస్ ఇప్పటి వరకూ ప్రకటించిన 77 మంది అభ్యర్థుల జాబితాలో 20 మంది పటేళ్లు, 23 మంది బీసీలున్నారు.
కాంగ్రెస్ జాబితాలో ఎక్కువ కొత్త ముఖాలు
2012 ఎన్నికల్లో కాంగ్రెస్ 57 సీట్లే గెలిచింది. ఆ తర్వాతా కొందరు పార్టీ మారడంతో కాంగ్రెస్ బలం ఇంకా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎక్కువగా లేరు కాబట్టి కాంగ్రెస్ 77 సీట్లకు ప్రకటించిన తన తొలి జాబితాలో 53 సీట్లను కొత్తవారికి కేటాయించింది. అలాగే ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల సందర్భంగా అహ్మద్ పటేల్‌ను గెలిపించుకునేందుకు ఇచ్చిన మాట ప్రకారం సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ కాంగ్రెస్ మళ్లీ టికెట్లు ఇస్తోంది.
ఇప్పటికే బీసీ, దళిత సంఘాల నేతలు కాంగ్రెస్‌కు తమ మద్దతు ప్రకటించడం తెలిసిందే. అటు పటేళ్లకు రిజర్వేషన్ల సాధన కోసం పోరాడుతున్న పాస్ (పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి) మొదట కాంగ్రెస్‌వైపు మొగ్గుచూపి, తమకు 20 టికెట్లు కావాలని డిమాండ్ చేసింది. కానీ కాంగ్రెస్ తన తొలిదశ జాబితాలో పటేళ్లకు 20 టికెట్లు ఇచ్చినప్పటికీ, వారిలో పాస్ నేతలు ఇద్దరే ఉన్నారు. దీంతో కాంగ్రెస్‌కు పాస్ మద్దతుపై ప్రస్తుతం కొంత సందిగ్ధత నెలకొంది.
బీజేపీ మతతత్వంపై నోరు మెదపని కాంగ్రెస్!
2002లో నరేంద్రమోదీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఆరు నెలల్లోపే గుజరాత్‌లో అల్లర్లు చెలరేగడం తెలిసిందే. 2007 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయనను ‘మౌత్ కా సౌదాగర్’ (జనం చావుతో వ్యాపారం చేసే నేత) అంటూ ముస్లింల ఊచకోతను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పదేపదే ప్రస్తావించారు. ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం బీజేపీ మతతత్వం గురించి కానీ, గోధ్రా అల్లర్ల గురించి కానీ కాంగ్రెస్ మాట ఎత్తడం లేదు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్రంలోని ప్రధాన గుళ్లనన్నింటినీ సందర్శించి హిందువులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారనేది కొందరి వాదన. ముస్లింలు, మసీదుల ఉనికిని ఆయన పట్టించుకోకపోయినా గుజరాత్‌లో మైనారిటీలు హస్తానికిగాక మరే ఇతర పార్టీకి ఓటేయరనే దీమా కాంగ్రెస్‌ను మందిరాల వైపు నడిపిస్తోంది. మొత్తానికి గోధ్రా అల్లర్ల తర్వాత జరుగుతున్న నాలుగో అసెంబ్లీ ఎన్నికలు మిగిలిన మూడు ఎన్నికల కంటే భిన్నమైన రీతిలో ఉంటాయని ఎన్నికల విశ్లేషకుల అంచనా.
సం‘కుల సమరం’..!
Published Tue, Nov 21 2017 2:30 AM | Last Updated on Fri, Mar 29 2019 5:35 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment