కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది కావస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలనను, సాధించిన విజయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది.
విస్తృతంగా ప్రచారం చేసుకోవాలని బీజేపీ నిర్ణయం
న్యూఢిల్లీ: కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది కావస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలనను, సాధించిన విజయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. దేశంలో సహాకార పూర్వక సమాఖ్య వ్యవస్థ, సమ్మిళిత అభివృద్ధి దిశగా మోదీ అడుగులు వేస్తున్నారని.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నారని ప్రచారం చేయాలని భావిస్తోంది. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 26 నుంచి ‘జన్ కల్యాణ్ పర్వ్’ పేరిట వారం పాటు వేడుకలు నిర్వహించే అంశంపై ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ మంగళవారం సమావేశమై చర్చించింది.
ఈ సందర్భంగా గత ఏడాదిలో సాధించిన విజయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని తీర్మానించినట్లు కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. దేశంలో పేదరికం కొనసాగాలని కొన్ని పార్టీలు కోరుకుంటున్నాయని.. తాము అలా జరగనివ్వబోమని, పేదరికాన్ని నిర్మూలిస్తామని మరో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తమ అవినీతి రహిత, సమర్థవంతమైన పాలనతో దేశం ఆర్థికంగా దూసుకుపోతుందన్నారు. మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో ఎన్నో చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుందని.. పేదల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తోందని చెప్పారు.
సంక్షేమానికి పాటు పడదాం..
గత యూపీఏ ప్రభుత్వ పదేళ్ల పాలనతో పోలిస్తే.. తమ ఎన్డీయే పది నెలల పాలనలో ఎన్నో విజయాలు సాధించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ విజయాలను గర్వంగా ప్రజల ముందుకు తీసుకెళదామని ఎంపీలకు సూచించారు.