
ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్లు నకిలీవా!?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్యార్హతలపై వివాదం కొనసాగుతూనే ఉంది. మోదీ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ డిగ్రీ పట్టాను, గుజరాత్ యూనివర్సిటీ నుంచి రాజనీతి శాస్త్రంలో పీజీ పట్టాను పొందారని పేర్కొంటూ.. ఆమేరకు సర్టిఫికెట్లను బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
అయితే, ప్రధాని మోదీ పేరిట విడుదల చేసిన ఈ సర్టిఫికెట్లు బూటకమైనవని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. నకిలీ డిగ్రీ పట్టాలను బీజేపీ విడుదల చేసిందని మండిపడింది. ఢిల్లీలో సోమవారం విలేకరులతో ఆప్ నేత అశుతోష్ మాట్లాడుతూ ప్రధాని మోదీ విద్యార్హతలపై బీజేపీ దేశాన్ని మోసం చేస్తోందని ఆరోపించారు. ప్రధాని పేరిట విడుదల చేసిన సర్టిఫికెట్లు యూనివర్సిటీ సరిఫ్టికెట్లతో సరిపోలడం లేదని, ఇవి నకిలీ, ఫోర్జరీ సర్టిఫికెట్లని ఆయన దుయ్యబట్టారు. ప్రధాని మోదీ విద్యార్హతల వివాదాన్ని మొదట ఆప్ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేవనెత్తిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ ఆరోపణలకు బదులిస్తూ బీజేపీ మోదీ డిగ్రీ పట్టాలను విడుదల చేసింది. మోదీ వ్యక్తిగత విషయంలోనూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడిన కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అయినా ఈ వివాదంలో ఆప్ వెనుకడుగు వేయడం లేదు.