భోపాల్ : మధ్యప్రదేశ్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేంద్రనాథ్ సింగ్‌పై సొంత కూతురే తీవ్ర ఆరోపణలు చేశారు. బలవంతంగా ఓ రాజకీయ నాయకుడి కొడుకుతో ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారంటూ హైకోర్టు ఆశ్రయించారు. కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేకనే అజ్ఞాతంలోకి వెళ్లానని తన న్యాయవాది ద్వారా హైకోర్టుకు వివరించారు. కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించమని ధర్మాసనాన్ని వేడుకున్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ విడియోను రిలీజ్ చేశారు.
తన కూతురు భారతీసింగ్ తప్పిపోయిందంటూ అక్టోబర్ 16న బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తను మానసిక రుగ్మతతో బాధపడుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా తన తండ్రి ఆరోపణలను భారతీసింగ్ తీవ్రంగా ఖండించారు. తాను మాససికంగా ఆరోగ్యంగానే ఉన్నానని, తప్పుడు మెడికల్ సర్టిఫికేట్లు సృష్టించి తనకు మెంటల్ అని కుటుంబ సభ్యులు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
‘నేను తప్పిపోలేదు. కావాలనే ఇంటి నుంచి బయటకు వచ్చాను. ఓ రాజకీయ నాయకుడి కొడుకుతో నాకు బలవంతంగా పెళ్లిచేయాలని చూస్తున్నారు. వేధింపులు తట్టుకోలేకనే బయటకు వచ్చాను. నేను క్షేమంగా, సంతోషంగా ఉన్నాను. నేను ఏ ముస్లింతోనో, క్రిష్టియన్‌తోనో పారిపోలేదు. ఒక్కదానినే బయటకు వచ్చాను. నాకు ఆ పెళ్లి ఇష్టంలేదు. కుటుంబ సభ్యులతో ప్రాణహానీ ఉంది. దయచేసి రక్షణ కల్పించండి’ అంటూ వీడియో ద్వారా హైకోర్టును వేడుకున్నారు. ఈ ఘటనపై భారతీసింగ్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ‘పుణేలో ఉద్యోగం చేస్తున్న భారతీ సింగ్‌ను ఇటీవల లక్నోకు రప్పించారు. అమ్మకు ఆరోగ్యం బాగాలేదని రప్పించి అనంతరం బలవంతపు పెళ్లి చేయాలని చూశారు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆమె వేరే మతం వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉంది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో ఆమెను వేధించడం మొదలు పెట్టారు. తను ఆరోగ్యంగానే ఉంది‘ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment